జగన్ కు ప్రాణహాని లేదు.. కోర్టుకు స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ
posted on Jun 25, 2025 9:28AM

తనకు ప్రాణహాని ఉందనీ, అదనపు భద్రత కావాలని గగ్గోలు పెడుతున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటల్లోని డొల్లతనం కేంద్ర హోంశాఖ తేటతెల్లం చేసింది. పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఎటువంటి ప్రాణహానీ లేదని కేంద్ర హోంశాఖ ఏపీ హైకోర్టుకు తెలిపింది. జగన్ భద్రతపై కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో కీలక నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో జగన్ కు ఎలాంటి ప్రాణహాని కానీ, ముప్పు కానీ లేదని పేర్కొంది. ఈ మేరకు ఆ నివేదికను డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఏపీ హైకోర్టుకు నివేదించారు.
తనకు జడ్‌ప్లస్ కేటగిరి భద్రతను పునరుద్దరించేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్ఎస్‌జీ లేదా సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో భద్రత కల్పించాలని ఆ పిటిషన్‌లో జగన్ కోరారు. జగన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికే 58 మందితో జగన్‌కి జడ్‌ప్లస్ భద్రత కల్పిస్తున్నామని హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చెప్పారు. ఏపీ ప్రభుత్వం భద్రత కల్పించలేదని పిటిషనర్ చెప్పిన వాదనలో వాస్తవం లేదని ప్రభుత్వ న్యాయవాదిపేర్కొన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశిం చింది. కాగా ఈ కేసు విచారణ జులై 15వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.