ఖతార్ ఖతర్నాక్ దెబ్బ?.. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ స్టాప్!?
posted on Jun 25, 2025 9:55AM

ఈ ట్రంపున్నాడే.. తొందరెక్కువ- వివరం తక్కువ.. అంటారు కొందరు. జీ- 7 నుంచి హడావిడిగా వెళ్తూ కాల్పుల విరమణకన్నా మించి జరగబోతోందని బిల్డప్ ఇచ్చి వెళ్లారు. తీరా చూస్తే.. ఇరాన్ తో కాళ్లా వేళ్లా బతిమిలాడుకుని ఈ యుద్ధం ఆపుకోవల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. కారణం ఏంటంటే ఖతార్ రాజధాని దోహా ఔట్ స్కర్ట్స్ లో 60 ఎకరాల్లో 1996లో స్థాపించిన అల్ ఉదీద్ అనే సైనిక స్థావరంపై ఇరాన్ గురి చూసి కొట్టడమేనట. ఉండే వాడు ఉండకుండా మొన్న గత ఇరవై ఏళ్లలో ఏ అధ్యక్షుడూ వెళ్లని విధంగా ఇక్కడి సైనికులను వెళ్లి కలిసి వచ్చారు ట్రంప్.
సుమారు 12 రోజుల పాటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య బీభత్సమైన యుద్ధం. అది ఎంతగా ఉంటే ఇజ్రాయెల్ రోజుకు 2400 కోట్లు ఖర్చు చేసి మరీ చేస్తోన్న యుద్ధం. నిజంగా అమెరికా డైరెక్ట్ ఎంట్రీ లేకుంటే ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేది కాదేమో. తన బంకర్ బస్టర్ బాంబర్లతో ఇరాన్ అణు శుద్ధి కేంద్రాలపై దాడులు చేసి నానా హంగామా చేయడం యూఎస్ కి ఎంత చేటు తెచ్చిందంటే.. ఇరాన్ టార్గెట్ ఇటు తిరిగేంత.
అప్పటికీ సుప్రీం లీడర్ ఖమేనీ సలహాదారు అలీ అక్బర్ అంటూనే ఉన్నాడు అమెరికాకు ప్రతీకార దాడులు తప్పవని. అన్నట్టుగానే ఖతర్ లోని యూఎస్ సైనిక స్థావరం మీద బాంబుల వర్షం కురిపించారు. అందులో యూఎస్ మాత్రమే కాదు యూకే ఇతర విదేశీ విమానాలెన్నో ఉంటాయి. అంతేనా ఏకంగా పది వేల మంది సైనికులు ఇక్కడ ఉంటారు. అంత పెద్ద ఎయిర్ బేస్ అది. సెప్టెంబర్ లెవన్ అటాక్స్ తర్వాత ఇక్కడి నుంచి ఆఫ్గన్ తాలిబన్లు, అల్ ఖైదా కార్యకలాపాలను కంట్రోల్ చేస్తూ వస్తోంది అమెరికా.
దీంతో పాటు బహ్రెన్, ఇరాక్, ఇజ్రాయెల్, ఈజిప్ట్, జోర్దాన్, కువైట్, సౌదీ సిరియా అంటూ 8 స్థావరాలుండగా.. వీటన్నిటిలో కలిపి సుమారు 50 వేల మంది సైనికులుంటారు.. వీటిలో ఖతార్ చాలా చాలా కీలకం. దీని ద్వారా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నియంత్రిస్తూ ఉంటుంది అమెరికా. వీటన్నిటికి తోడు ఇది ఇరాన్ కి కేవలం 190 కిలోమీటర్లు మాత్రమే. ఇక్కడ కొడితే ఫస్ట్ అందులో ఎన్ని విమానాలను కొట్టింది.. ఎందరు సైనికులను చంపారన్న విషయం అటుంచితే.. అసలీ స్థావరాన్ని టార్గెట్ చేయడంతో అమెరికా పేరు యుద్ధ మార్కెట్లో మట్టికొట్టుకుపోతుంది.
మొన్న భారత్- పాక్ యుద్ధం ఆపడంలో కూడా సరిగ్గా ఇదే సమస్య. తమ ఎఫ్- 16లను భారత్ అవలీలగా దాడి చేసేస్తుందన్న మాట మార్కెట్లో వినిపిస్తే ఇంకేమైనా ఉందా? అది తమ ఆయుధ వ్యాపారం మొత్తాన్ని కుప్ప కూల్చేస్తుంది. అందుకే ఈ యుద్ధం విషయంలోనూ.. ట్రంప్ వెంటనే అలెర్ట్ అయ్యి.. అప్పటి వరకూ బీరాలన్నిటినీ తూచ్ అనేశారు. కాల్పుల విరమణకు రమ్మంటూ ఇరాన్ని బతిమలాడుకున్నారు. ఈ విషయం ఇరాన్ యంత్రాంగం చెబుతోంది. అందుకే తాము కాల్పుల విరమణ చేసుకున్నామని అంటోంది.
మొన్నే ఈ స్థావరాన్ని సుమారు 8 బిలియన్ డాలర్లతో అప్ గ్రేడ్ చేసినట్టు చెబుతుంది వాషింగ్టన్ కి చెందిన ద హిల్ అనే పత్రిక. ఇపుడా డబ్బు మొత్తం మంట గలవడంతో పాటు.. తమ దేశ పరువు అమాంతం పోతుంది. దీంతో పరిస్థితి అర్ధం చేసుకున్న ట్రంప్.. ఇరాన్ తో ఒక సయోధ్యకు వచ్చారు. ఈ దిశగా ట్రూత్ అనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో పోస్ట్ పెట్టారు. పోస్టు పెట్టిన ఆరు గంటలకు ఇరాన్ ఇజ్రాయెల్ రెండూ కాల్పుల విరమణ ఒప్పందానికి తాము వచ్చినట్టు అంగీకరించాయి.
ఇందులో ఇజ్రాయెల్ అంటున్న మాట ఏంటంటే.. తమ ఆపరేషన్ రైజింగ్ లయన్ మిషన్ కంప్లీట్ అయ్యింది. ఇరాన్ సైనిక నాయకత్వంతో పాటు లేటెస్టుగా మరో అణు సైంటిస్టును కూడా హతమార్చాం అంటోంది. దీంతో తాము హ్యాపీ అన్నది ఇజ్రాయెల్ అంటోన్న మాట. ఈ పన్నెండు రోజుల యుద్ధం ద్వారా తాము సుమారు 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా.. అందుకంటూ ఒక పరమార్ధం ఉందంటోంది.
ఇజ్రాయెల్ వరకూ ఓకేగానీ.. ఇప్పుడు అమెరికా సిట్యువేషనే మరీ దారుణంగా తయారైంది. అమెరికా వదిలిన బాంబుల ద్వారా ఇరాన్ కోల్పోయిందేమీ లేదు. పైపెచ్చు 60 శాతం శుద్ధి చేసిన 400 కిలోల యురేనియం ఇరాన్ దగ్గర ఎంతో సేఫ్ గా ఉంది. దీంతో పది అణు బాంబుల తయారీ చేయవచ్చని తెలుస్తోంది.
అయినా సరే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేస్తోన్న కామెంట్ ఏంటంటే.. మళ్లీ ఇరాన్ అణ్వాయుధ తయారీ చేస్తే అత్యంత శక్తిమంతమైన అమెరికన్ ఆర్మీ ప్రతాపం చవి చూడాల్సి వస్తుందని. ఇక్కడ ఎవరు ఎవరికి ప్రతాపం చూపించారో.. అందరూ చూశారంటూ కొందరు కామెంట్లు చేయడం కనిపిస్తోంది.