కొందరు సీనీ నటులకు ఎమ్మెల్సీ తాయిలాలు.. జగన్ ఎత్తుగడ

జగ‌న్ కు ఈసారి సినిమా వాళ్ళ అవసరం తప్పేలా లేదు. ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. సర్వేలు కూడా అదే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. వాస్తవమెంతో తెలియదు కానీ జగన్ స్వయంగా ఐ ప్యాక్ ద్వారా చేయించుకున్న సర్వేలో కూడా ఆయన క్యాబినెట్ లోని పాతిక మంది మంత్రులు వచ్చే ఎన్నికలలో ఓటమి చవిచూడనున్నారని తేలింది. మరో వైపు ఏపీలో తెలుగుదేశం, జనసేన పొత్త దాదాపు ఖరారైంది.

బీజేపీ సంగతి ఇంకా ఎటూ తేలకపోయినా, తెలుగుదేశంతో జనసేన కలిసి పోటీ చేస్తే జగన్ పార్టీకి పరాజయం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలో వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కోకతప్పదని అంటున్నారు. గత ఎన్నికలలో అంటే 2019 ఎన్నికలలో వైసీపీకి అనుకూలంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రచారం చేశారు. మోహన్ బాబు, మంచు విష్ణు, కృష్ణుడు, భానుచందర్, అలి, పోసానికృష్ణమురళి, రాజశేఖర్, జీవిత, థర్టీ ఇయర్స్ పృధ్వీ ఇలా జాబితా పెద్దదే ఉంది. అయితే ఈ సారి మాత్రం జగన్ కు అనుకూలంగా ప్రచారం చేయడానికి ఇప్పటి వరకూ అయితే అలీ, పోసాని వినా మరెవరూ కనిపించడం లేదు. మోహన్ బాబు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తనకు టీటీడీ చైర్మన్ లేదా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం వస్తుందని ఆశించి భంగపడ్డారు. జగన్ అధికారం చేపట్టగానే ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వికి మాత్రమే పదవి ఇచ్చారు. అది కూడా మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. ఇక ఆ తరువాత మూడున్నరేళ్లకు అలీ, పోసానిలకు సలహాదారు పదవులు కట్టబెట్టారు. మిగిలిన వారి గురించి కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు.  దీంతో వారంతా పార్టీ కార్యక్రమాలకు ఒకింత దూరంగానే ఉంటున్నారు. ఇక వచ్చే ఎన్నికలలో తీవ్ర మైన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న జగన్ గట్టెక్కేందుకు మరో సారి సినీ జీవులపైనే ఆధారపడనున్నారని పరిశీలకులు అంటున్నారు.

అందు కోసమే.. వారికి ఏదో విధంగా ప్రయోజనం చేకూర్చేందుకు యోచిస్తున్నారని చెబుతున్నారు. వచ్చే మార్చిలో రాష్ట్రంలో 12 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటిని సీనీ జీవులతో భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే అది ఎంత వరకూ సాధ్యమౌతుందన్నది ప్రశ్నార్థకమే. ఎందుకంటే పార్టీలో కూడా జగన్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పలువురు ఆశావహులు ఎమ్మెల్సీ సీట్ల కోసం ఎదురు చూస్తున్నారు.

చిలకలూరిపేట   మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ తో పాటు పలువురికి జగన్ ఇప్పటికే హామీ  ఇచ్చారు.  ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయంలో పవన్ ను విమర్శించే వారికి జగన్ పెద్దపీట వేయొచ్చు అనే మాట వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి ఒకరిద్దరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే అవకాశం ఉందని కూడా పార్టీ శ్రేణులు అంటున్నాయి.  వచ్చే ఎన్నికలలో పార్టీకి సినీ గ్లామర్ ను అద్దడానికి జగన్ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.