చంద్రబాబుకు సరెండర్ అవుతున్న అక్రమార్కులు!
posted on Nov 29, 2023 1:33PM
వైసీపీ ఇంటికి.. తెలుగుదేశంకు అధికారం. మరోసారి సీఎం కుర్చీ చంద్రబాబుదే. రానున్న ఎన్నికలలో ఏపీలో తెలుగుదేశం అధికారం దక్కించుకోవడం గ్యారంటీ. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాలలో విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న అభిప్రాయం. అయితే., ఈ మాట సర్వే సంస్థలు, పరిశీలకులు, విశ్లేషకులు మాత్రమే కాదు. రాజకీయాలను అవపోసన పట్టిన మేధావులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, బడా వ్యాపార వేత్తలు కూడా ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్న మాట. అందుకే ఇప్పుడు ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారులు చంద్రబాబుకు జగన్ హయాంలో తాము నిస్సహాయులుగా మారి ప్రభుత్వం చెప్పినట్లల్లా చేయాల్సి వచ్చిందని చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే.. బడా బడా వ్యాపార వేత్తలు, జగన్ హయాంలో పెద్దపెద్ద కాంట్రాక్టులను చేజిక్కించుకుని యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడిన వాళ్లూ కూడా చంద్రబాబుతో భేటీకి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా నాలుగున్నరేళ్లుగా.. వ్యాపార వేత్తల ముసుగులో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అక్రమార్జనతో కోటికి పడగలెత్తిన వారు కూడా ఇప్పుడు చంద్రబాబు ఇంటి బాట పడుతున్నారు. ఇప్పటికే జగన్ సర్కార్ అవినీతిపై తెలుగుదేశం నేతలు, పలువురు మేధావులు కోర్టులలో పిటిషన్లు వేయడం, దర్యాప్తు సంస్థలకు సమాచారం అందిస్తుండడంతో ఈ దోపిడీ దారులకు వెన్నులో వణుకు పుడుతుంది. ఒకవేళ అధికారం మారిపోయి, చంద్రబాబు గద్దె ఎక్కడం జరిగితే ఈ కేసులు తమ మెడకు యమపాశాలుగా మారతాయన్న ఆందోళనతో ముందుగానే చంద్రబాబు శరణు కోరుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో అధికార మార్పు ఖాయమన్న అభిప్రాయం ఇటు రాజకీయవర్గాలనూ పరిశీలకులలోనే కాదు, అటు అధికారులు, రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని అక్రమార్జనకు పాల్పడిన బడా వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లలో కూడా బలంగా వ్యక్తం అవుతోంది. జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో కొద్ది మంది వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకున్నారన్నది కాదనలేని వాస్తవం. ఈ దోపిడీ పర్వాల మీద ఇప్పుడు తెలుగుదేశం నేతలు న్యాయస్థానాలలో కేసులు వేస్తున్నారు. నిఘా, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు చేస్తున్నారు. స్పష్టమైన ఆధారాలతో, న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఈ తీరు చూసిన అక్రమార్కులలో వణుకు మొదలైంది. జగన్ ప్రభుత్వం పతనమై.. చంద్రబాబు అధికారంలోకి వస్తే జరగబోయేది ఊహించుకుని వణికిపోతున్నారు. అందుకే చంద్రబాబు ఇంటికి దారి వెతుక్కుంటున్నారు. ఎన్నికలకు ముందే చంద్రబాబుతో సయోధ్య కుదుర్చుకొంటే సేఫ్ అని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఎలక్ట్రికల్ కంపెనీ అధినేత చంద్రబాబును కలిసినట్లు తెలుస్తున్నది. అది కూడా జగన్ కుటుంబంతో దగ్గరి సంబంధాలు ఉన్న ఆ వ్యాపారవేత్త వైసీపీ ఎంపీకి బినామీ అనే ప్రచారం కూడా ఉంది. అలాంటి వ్యక్తి ఓ ఐఏఎస్ అధికారి మధ్యవర్తిత్వంతో చంద్రబాబుతో భేటీ కాగలిగారు. ఇక ఇదే వరసలో రెండు తెలుగు రాష్ట్రాలను శాసించే మరో ఇద్దరు బడా ఇంజనీరింగ్ అండ్ కనస్ట్రక్షన్ కంపెనీల యజమానులు, ఓ ఫార్మా కంపెనీ యజమాని కూడా చంద్రబాబు అపాయింట్ మెంట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఈ ముగ్గురూ కూడా గత ఎన్నికల సమయంలో కేంద్రం మెప్పు కోసం చంద్రబాబుతో విభేదించారు. ఇక జగన్ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా అడ్డగోలుగా లబ్ధి పొందేలా కాంట్రాక్టులూ, పనులూ పొందారు. అయితే ఇప్పుడు పరిస్థితి తారుమారవ్వడంతో చంద్రబాబు ఆశీస్సుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
ఏదో వ్యాపారవేత్తలు, అధికారులే చంద్రబాబు శరణం గచ్ఛామీ అనడం కాదు.. ఏకంగా వ్యాపారాలతో సంబంధాలున్న రాజకీయ నేతలు కూడా ఇప్పుడు చంద్రబాబు అండకోసం ప్రయత్నాలు చేస్తున్నారంటే వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయం అనడానికి ఇంత కంటే ఆధారాలేం కావాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీలో ఉంటూ చంద్రబాబుపైనే దాడికి ప్రయత్నించిన నేత తనయుడు కూడా బాబుతో సయోధ్యకు మధ్యవర్తుల ద్వారా ప్రయత్నం సాగిస్తున్నారంటే ఇక్కడ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. జగన్ ప్రభుత్వంలో మద్యం అక్రమాలలో ఈ నేత తనయుడిదే మేజర్ వాటా కాగా.. రాయలసీమలో గ్రానైట్, కంకర దందా.. ప్రభుత్వ భూముల ఆక్రమణ వంటివి అదనంగా ఉన్నాయి. ఇప్పటికే ప్రతి అంశంపై ఫిర్యాదు ఉండగా ఏ క్షణమైనా దర్యాప్తు ఆరంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ కారణంగానే తండ్రిని కూడా కాదని ఈ తనయుడు చంద్రబాబు శరణు కోరినట్లు తెలుస్తుంది. ఇక, కృష్ణ, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలకు చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా ఇదే తరహాలో
చంద్రబాబు ప్రాపకం కోసం ప్రాకులాడుతున్నట్లు చెప్తున్నారు. ఇలా జగన్ హయాంలో అక్రమాలకు పాల్పడి , ఆయాచిత లబ్ధి పొందిన వారంతా ఇప్పుడు చంద్రబాబును శరణుజోచ్చుతున్నారు. అయితే చంద్రబాబు ఎలా స్పందిస్తారు, వీరి ద్వారా జగన్ అక్రమాలు , అవినీతిని ప్రజల ముందు ఉంచుతారా అన్నది చూడాల్సి ఉంది.