భారతీయ చేనేత….. వస్త్రప్రపంచానికి అధినేత!

మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవి, అవి వారసత్వంగా కొనసాగుతున్నవి కూడా. కళల పేరిట భారతదేశానికే ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టేవి. అలాంటి వాటిలో చేతి వృత్తులు చాలా ఉన్నాయి. చేతి వృత్తులలో చేనేతకు ఎంతో చరిత్ర ఉంది. భారతదేశంలో స్వదేశీ ఉద్యమం 1905 లో మొదలైంది. అప్పుడు విదేశీ వస్తు బహిష్కరణ చేస్తూ ఖద్దరు దుస్తులు వేసుకుంటూ నిరసన తెలిపినవారు ఉన్నారు. 

భారతీయ చేనేత పరిశ్రమకు ఎంత చరిత్ర ఉందో ఈ పరిశ్రమలో అంత కళాత్మకత కూడా ఉంది. కేవలం ఏదో ఒకటిలే అన్నట్టు కాకుండా ఎంతో అద్భుతమైన ఆకారాలతో, కనులను కట్టిపడేసే రంగులతో  వస్త్రాలు నేయడం నేతన్నల గొప్పదనం. 

భారతదేశం స్వదేశి ఉద్యమం చేపట్టిన రోజునే భారతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశంలో ఈ చేనేత వృత్తి మీద ఆధారపడిన వారి ఆర్థిక, సామాజిక అవసరాలను గురించి, చేనేత గొప్పదనం గురించి, అందులో ఉన్న సంప్రదాయపు విలువల గురించి యావత్ దేశమంతా అవగాహన కలిగించాలనేదే సంకల్పంగా జరుపుకుంటున్న రోజు ఇది.

చేనేత వృత్తి ఎంచుకున్న వాళ్లలో ఆసక్తికరంగా ఆడవాళ్లు 70% మంది ఉన్నారు. దీన్ని బట్టి భారతీయ చేనేత వస్త్రపరిశ్రమలో మహిళల సాధికారతకు చేనేత వృత్తి ఎంత గొప్పగా దోహదం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఈ భారతీయ చేనేత దినోత్సవం పూర్తిగా చేనేత కార్మికులను గుర్తించాలని, వారిలో ఉన్న కళకు ప్రపంచవ్యాప్త ప్రశంసలు అందాలనేది ముఖ్య ఉద్దేశం.

చేనేత దినోత్సవం ఎవరి కృషి?

ప్రస్తుత ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారు 2015వ సంవత్సరంలో మొట్టమొదటిసారి  భారతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించి దేశవ్యాప్తంగా తన గళాన్ని వినిపించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆగష్టు 7 వ తేదీన దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటూనే ఉన్నారు. ఏడు చేనేత దినోత్సవాలను పూర్తిచేసుకుని ఇప్పుడు ఎనిమిదవ చేనేత దినోత్సవ సంబరాలకు భారతదేశం సిద్ధమవుతోంది.

చేనేత పరిశ్రమ గురించి ఆసక్తికర విషయాలు!

భారతదేశంలో చేనేత పరిశ్రమ అతిపెద్ద అసంఘటిత ఆర్థిక కార్యకలాపాలలో ఒకటి. ఇది పట్టణ-గ్రామీణ సత్సంబంధాలను పెంచుతుంది. ముఖ్యంగా గ్రామీణ జీవనోపాధిలో అత్యంత ముఖమైనదిగా చేనేత మంచి స్థానంలో నిలుచుంది.

భారతీయ చేనేత రంగం తక్కువ మూలధనంతో నిర్వహించగలిగిన అంశం. అయితే దీనిలో ఉన్న అద్బుతమంతా చేనేత కళాకారులలో ఉన్న కళలోనే ఉంది. 

అన్నిటికంటే ముఖ్యంగా చేనేత పరిశ్రమ ఇతర ఫ్యాక్టరీ ఉత్పత్తుల్లా కాలుష్యాన్ని విడుదల చేయదు. దీనివల్ల  పర్యావరణానికి హాని కలగకుండా ఉంటుంది.

చేనేత పరిశ్రమ భారతదేశంలో గొప్ప కుటీర పరిశ్రమగా గుర్తించబడింది. సహజ ఉత్పత్తుల ద్వారా నడిచే ఈ పరిశ్రమ చిన్న పెద్ద ఆర్థిక స్థాయిలకు తగ్గట్టు అందుబాటులో ఉంటుంది.

ముఖ్యంగా కళాత్మకతను నింపుకున్న ఈ చేతివృత్తిని ఒకతరం నుండి మరొక తరం అందిపుచ్చుకుంటూ కళలో ఉన్న నైపుణ్యాన్ని వ్యాప్తం చేస్తున్నారు.

రాట్నం, నూలు, మగ్గం ద్వారా నడిచే చేనేత పనిలో అన్ని వర్గాల వారు భాగస్వాములు అవుతారు.

ఇప్పుడు అన్ని దేశాలు చేనేత వస్త్రాల వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. కానీ శాతవాహనుల కాలంలోనే భారతదేశ చేనేత వస్త్రాలు యూరప్ దేశాలకు ఎగుమతి అయ్యాయి అనే విషయం భారతీయ చేనేత పనితనం, దాని చరిత్ర ఎంతగొప్పవో అందరికీ తెలుపుతుంది.

మనం ఏమి చేయగలం?

విదేశీ వస్త్ర మోజులో పడి మన కళను మన పనితనాన్ని మనం చిన్నచూపు చూడటం తగదు. అందుకే ప్రత్యేకంగా చేనేత దినోత్సవం రోజున మాత్రమే కాకుండా మిగిలిన రోజుల్లో కూడా పండుగలను, శుభకార్యాలకు, ప్రత్యేకరోజుల్లో చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం మంచిది. అలాగే కళను జోడించి చేనేత వస్త్రాలనే కొంచెం మోడ్రన్ గా మలచుకోవచ్చు.

మిగిలిన దుస్తులతో పోలిస్తే చేనేత రంగులు ఆకర్షణీయంగా ఉంటాయి. అంతేకాదు మన్నిక బాగుంటాయి.

నేరుగా చేనేత వ్యక్తుల దగ్గరకు వెళ్లి నచ్చినవి కొనుగోలు చేయచ్చు. ఇంకా ఆసక్తి ఉంటే నచ్చినట్టు అడిగి మరీ నేయించుకోవచ్చు.

ఇలా మన భారతీయ చేనేత వస్త్ర పరిశ్రమ గొప్పదనాన్ని తెలుసుకుని దానికి గుర్తింపు వచ్చేలా ప్రోత్సహించడం మనందరి చేతుల్లోనే ఉంది.

                                 ◆నిశ్శబ్ద.