ఇక హైడ్రాకు సూపర్ పవర్స్
posted on Sep 14, 2025 3:13PM

హైడ్రాకు సూపర్ పవర్స్ రానున్నాయా? అంటే మున్సిపల్ శాఖ అదే నిజమని అంటోంది. కారణమేంటంటే జీహెచ్ఎంసీలో చాలా మంది కాంట్రాక్టర్లు చేయని పనులకు కూడా బిల్లులు తీస్కుంటున్నట్టు కనిపిస్తోంది. వీటన్నిటినీ కట్టడి చేయడానికి హైడ్రా ఒక క్రాస్ చెక్ చేసేలా ఏర్పాటు చేస్తున్నారు.
కాంట్రాక్టర్లు ఎక్కడెక్కడ ఏయే పనులు చేస్తున్నారు? ఎంత శాతం మేర చేస్తుంటే.. ఎంత శాతం చేసినట్టు చెబుతున్నారు? వారికి ఎంత మేర బిల్లులు ఇస్తే బావుంటుంది? వంటి అంశాలతో కూడిన నియమావళిని రూపొందిస్తున్నారు.
వీటన్నిటిపై హైడ్రా అధికార గణం ఒక రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుంది. ఆ రిపోర్ట్ ద్వారా.. జీహెచ్ఎంసీ నిధులు చెల్లించేలా ఒక ఏర్పాటు చేస్తోంది మున్సిపల్ శాఖ. ఇప్పటి వరకూ ఒక లెక్క ఇప్పటి నుంచి మరోలెక్కగా జరగనుంది. ఇకపై హైడ్రా నివేదికల్లేకుండా జీహెచ్ఎంసీ ఎలాంటి బిల్లులూ చెల్లించరాదు.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. హైడ్రా మీద కూడా ఒక విజిలెన్స్ టీం పని చేస్తుంది. వీరు హైడ్రా ఇస్తున్న రిపోర్ట్స్ కరెక్టా కాదా? అని చూస్తారు. ఒక వేళ హైడ్రా గానీ తప్పుడు లెక్కలు చెప్పి ఉంటే.. సంబంధిత అధికారులను సైతం బాధ్యులను చేస్తారు. అంటే డబుల్ చెక్ మోడల్ అన్నమాట.మరి ఈ మొత్తం క్రాస్ చెక్ లోంచి ఇక కాంట్రాక్టర్లు తప్పించోలేరా? వారి తప్పుడు బిల్లుల బాగోతం బట్టబయలు అయినట్టేనా?? అన్నది తేలాల్సి ఉంది.