వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణకు కోర్టును ఆశ్రయించిన గవాస్కర్

 

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన సునీల్ గావస్కర్, వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం కోర్టును ఆశ్రయించిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచారు.  టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిష్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికలపై తన పేరు, ఫొటోలు అక్రమంగా వాడుకుంటున్నారని ఆరోపిస్తూ లిటిల్ మాస్టర్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఢిల్లీ కోర్టు విచారణ జరిపి తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. గావస్కర్ దావాను అధికారిక ఫిర్యాదుగా పరిగణించి, హక్కులు ఉల్లంఘిస్తున్న సోషల్ మీడియా సంస్థలు వెంటనే ఆ కంటెంట్‌ను తొలగించాలని సూచించింది. 

ఆన్‌లైన్‌లో అభ్యంతరకర కంటెంట్‌పై చర్యలు కోరే వ్యక్తులు, ముందుగా ఐటీ నిబంధనల ప్రకారం అందుబాటులో ఉన్న ఫిర్యాదుల యంత్రాంగాన్ని వినియోగించుకోవాలని, ఆ తర్వాతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల బేసిక్ సబ్‌స్క్రైబర్ ఇన్ఫర్మేషన్ , ఐపీ వివరాలను అందిస్తామని మధ్యవర్తులు కోర్టుకు తెలియజేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు, ప్రతివాదులు 7, 10, 11గా ఉన్న మధ్యవర్తులు గావస్కర్ పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. హక్కులు ఉల్లంఘిస్తున్న కంటెంట్‌కు సంబంధించిన స్పష్టమైన యూఆర్‌ఎల్‌లను 48 గంటల్లో కోర్టులో హాజరైన న్యాయవాది ద్వారా సమర్పించాలని పిటిషనర్‌కు సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 22కి వాయిదా వేసింది.

సినిమా రంగానికే పరిమితమైన ఇటువంటి వివాదాలు ఇప్పుడు క్రీడా రంగానికీ విస్తరించాయన్నది ఈ కేసుతో స్పష్టమైంది. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, నాగార్జున, అనిల్ కపూర్, అభిషేక్ బచ్చన్, డిజిటల్ క్రియేటర్ రాజ్ శమానీ వంటి ప్రముఖులకు వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పులు ఇచ్చింది. డీప్‌ఫేక్‌లు, వాయిస్ క్లోనింగ్‌, ఏఐ సృష్టించిన తప్పుడు వీడియోలు, అనధికార డిజిటల్ మెర్చండైజ్ వంటి కొత్త తరహా ముప్పులపై కూడా న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే వ్యంగ్యం, కళాత్మక వ్యక్తీకరణ, వార్తా కథనాలు, వ్యాఖ్యానాల వంటి రంగాలపై ఈ పరిరక్షణ ప్రభావం ఉండదని కోర్టు స్పష్టం చేసింది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu