తెలంగాణలో చలి పంజా...పడిపోతున్న ఉష్ణోగ్రతలు

 

తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. అత్యంత కనిష్ఠ స్ధాయికి ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో ప్రజలు వణుకుతున్నారు. గత వారం అత్యల్పంగా  సగటున 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం, రాత్రి పొగ మంచు ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హైదరాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. 

గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏకంగా 28 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్‌ నమోదయింది. దీంతో గత పదేళ్ల రికార్డు (డిసెంబరు 12న ఇంత తక్కువ నమోదు కావడం) బద్దలైంది. దీంతోపాటు డిసెంబరు రెండోవారంలో ఎక్కువ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడం కూడా ఇదే తొలిసారని.. ఇంత తక్కువ గతంలో నమోదు కాలేదని వాతావరణశాఖ తెలిపింది. 

హైదరాబాద్‌లో 10.8 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కన్నా 4.9 డిగ్రీలు తక్కువ. హనుమకొండలో ఏకంగా 7.4 డిగ్రీలు తగ్గి 8.5 నమోదైంది. ఆదిలాబాద్‌లో 5.6 డిగ్రీలు, మెదక్‌లో 6.5 డిగ్రీల మేర సాధారణం కంటే ఉష్ణోగ్రతలు పడిపోయాయి.రాష్ట్రంలో శని, ఆది, సోమవారాల్లోనూ చలి తీవ్రత ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. చాలా జిల్లాల్లో 9.2 డిగ్రీల లోపు నమోదయ్యే అవకాశాలున్నాయని సూచించింది. శనివారం 20, ఆదివారం 13, సోమవారం 12 జిల్లాలకు ‘ఆరెంజ్‌’ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తంగా ఉండాలని సూచించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu