బంగాళదుంపలు ఉడికించేటప్పుడు చాలామంది చేసే తప్పులు ఇవే..!

 

భారతీయులు ఎక్కువగా ఉపయోగించే దుంప కూరగాయలలో బంగాళదుంపలు ముఖ్యమైనవి. వీటితో స్నాక్స్,  చిప్స్ తో పాటు,  బోలెడు రకాల వంటలు కూడా చేసుకుంటారు. అయితే బంగాళదుంపలను ఉడికించేటప్పుడు చాలామంది తెలియకుండా కొన్ని తప్పులు చేస్తారు. ఈ తప్పుల వల్ల బంగాళదుంపలు సరిగా ఉడకకపోవడం, పైన పొట్టు వచ్చినా లోపల పచ్చిగా ఉండటం జరుగుతుంది. అయితే 5 విషయాలను గుర్తుంచుకుంటే బంగాళదుంపలు చక్కగా దుంప మొత్తం సమంగా ఉడుకుతాయి. అంతేకాదు.. బంగాళదుంపల గురించి చాలా ముఖ్యమైన చిట్కాలు కూడా ఇదిగో ఇక్కడ తెలుసుకోండి..

ఎక్కువగా ఉడకబెట్టినప్పుడు..

బంగాళదుంపలను ఎక్కువగా ఉడకబెట్టినప్పుడు పెద్ద సమస్య వచ్చి పడుతుంది.  దుంపలు ఎక్కువగా ఉడకడం వల్ల మెత్తగా చేతిలో పట్టుకోగానే విరిగిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు  వాటిని ఫ్రిజ్ లో ఉంచడం వల్ల చాలా ప్రయోజనంగా ఉంటుంది.  కూల్ అయ్యాక బంగాళదుంపలు మెత్తదనం పోయి కాస్త గట్టిగా అవుతాయి.  అప్పుడు వీటిని కూరలలో తగినట్టుగా ఉపయోగించుకోవచ్చు.

వేడినీరు..

చాలామంది బంగాళదుంపలను తొందరగా ఉడికిద్దాం అనే ఆలోచనతో ముందే వేడి చేసిన నీటిలో బంగాళదుంపలు వేసి తరువాత వాటిని ఉడికిస్తారు. దీని వల్ల పైన తొక్క తొందరగా వచ్చేస్తుంది.  కానీ లోపల సరిగా ఉడకదు.  పచ్చిగా ఉంటుంది.  అందుకే నేరుగా చల్లని నీటిలో బంగాళదుంపలు వేసి  ఉడికించాలి.

ఉప్పు..

బంగాళదుంపలను కుక్కర్ లో ఉడికించేటప్పుడు కాసింత ఉప్పు జోడించాలి.  ఇలా చేయడం వల్ల బంగాళదుంప తొక్క చాలా మెత్తగా అయిపోయి దుంప జారిపోయేలా కాకుండా దుంప మొత్తం సమంగా ఉడకడానికి సహాయపడుతుంది.

ఎక్కువ నీరు..

బంగాళదుంపలను ఉడికించడానికి ఎక్కువ నీరు ఉపయోగించడం వల్ల కూడా బంగాళదుంపలు చాలా మెత్తగా, నీటిలోనే కలిసిపోయేలా అయ్యే అవకాశం ఉంటుంది.  4 విజిల్స్‌లో పూర్తయ్యేంత నీటిని మాత్రమే జోడించాలి. అలాగే  మీడియం మంట మీద మాత్రమే ఉడకబెట్టాలి.  దీనివల్ల బంగాళాదుంపలు ఎప్పుడూ పగిలిపోకుండా ఉంటాయి. చిన్న పరిమాణంలో ఉన్న  బంగాళాదుంపలకు ఒక విజిల్ సరిపోతుంది.

గిన్నె పద్దతి..

బంగాళాదుంపలు తక్కువగా ఉంటే ముందుగా కుక్కర్‌లో చల్లటి నీరు పోసి స్టీల్ గిన్నె ఉంచాలి. బంగాళాదుంపలను గిన్నెలో వేసి మరిగించాలి.  దీనివల్ల బంగాళాదుంపలు నీటిని పీల్చుకోకుండా ఉంటాయి.  అవి విరగకుండా సులభంగా మృదువుగా మారుతాయి. వంటను సులభతరం చేయడంలో గిన్నె పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


                                   *రూపశ్రీ.

Related Segment News