ఆత్మహత్య ఆలోచన చాలా అల్పమైనది

ఈరోజుల్లో యువతలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పెరగడం బాధాకర విషయం. ఇంచుమించు వార్తా పత్రికలలో ప్రతిరోజూ ఆత్మహత్య సంఘటల్ని చూస్తున్నాము. ఆత్మహత్య గురించి ఆలోచించడం చాలా తెలివి తక్కువ పని. మానవ శరీరం దేవుడిచ్చిన విలువైన బహుమతి. చిన్న చిన్న విషయాల కోసం ప్రాణాలను విడవటం మంచిదికాదు. పిరికిపందలు,బలహీన మనష్కులే జీవితపు సవాళ్ళను ఎదుర్కోవడానికి భయపడతారు. అటువంటివారే ఇటువంటి తెలివితక్కువ పనులకు ఒడిగడతారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా సవాళ్లను ఎదుర్కునేవాడు ఎప్పుడూ ఇలాంటి ఆలోచన చేయడు. ఆ సవాళ్లకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తాడు.

చాలామంది తమ కోరికలు నెరవేరలేదు అని నిస్పృహ చెంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మనకు ఏది ప్రాప్తమో అదే దక్కుతుంది అనే సత్యాన్ని గ్రహించుకోలేరు. చిత్తశుద్ధితో, నిజాయితీతో పనిచేసి మనకు ఆ అర్హత కలిగించే శక్తిని ఎందుకు పెంచుకోకూడదు.

ఓ క్షణం ఆలోచిస్తే ప్రాణం తీసుకోవడానికి మించిన ధైర్యం ఈ లోకంలో ఇంకోటి ఉందని నేను భావించను. అలాంటి నీ ధైర్యాన్ని కొంచెం నీ జ్ఞానికి జత చేసి సమస్యపై పోరాటం చేస్తే అసాధ్యమైనా సుసాధ్యం కాగలదు.

కష్టాల్లో మన మనసు ఆలోచనా విధానం రాకెట్ వేగంతో ఉండాలి. మన నిర్ణయాలు,కార్యాచరణ మిస్సైల్ లా సాగాలి. మనో నిబ్బరాన్ని మించిన ఆయుధం ఇంకోటి లేదు. అది ఎప్పుడూ కోల్పోకూడదు. కనుక చిన్న చిన్న విషయాలకు ప్రాణాలను త్యజించి ఎంతో విలువైన జీవితాన్ని కోల్పోయి దేవుడు ఇచ్చిన దేహాన్ని హత్య చేసి వెళ్లిపోతే దేవుడు కూడా క్షమించడు.

◆ వెంకటేష్ పువ్వాడ