మనసే గ్రంధాలయం

ఒక పుస్తకం వందమంది స్నేహితులతో సమానం అంటారు. అలాంటి పుస్తకాలను అమితంగా ప్రేమించే వ్యక్తి వరంగల్ కి చెందిన కాసుల రవి కుమార్. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. రచన ప్రవృత్తి. చదువే మనిషిని వెలిగిస్తుంది. అయితే పుస్తకాలు అందుబాటులో లేక, సరైన మార్గ నిర్దేశం చేసేవారు లేక పుస్తక పఠనం తగ్గిపోతున్న ఈ డిజిటల్ రోజుల్లో చిల్డ్రన్స్ లీడ్ లైబ్రరీని స్థాపించి ఇంటినే గ్రంధాలయంగా చేసి గ్రామీణ విద్యార్థులకు పుస్తక పఠనం పై మక్కువ పెంచుతున్నారు. అదే ధ్యాసగా, శ్వాసగా నిరంతరం లైబ్రరీ కోసం పుస్తకాలు సేకరిస్తూ చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు వర్క్ షాప్ లు నిర్వహిస్తూ  లైబ్రరీని మరింత దగ్గర చేస్తున్నారు. ఇప్పటివరకూ 6000 పైగా పుస్తకాలను లైబ్రరీకి సేకరించారు.

రవి కుమార్ నేపథ్యం

నర్సంపేట టౌన్ లో రవికుమార్ నిరుపేద కుటుంబంలో జన్మించారు.తండ్రి నరేంద్రా చారి ఆటో డ్రైవర్, తల్లి సరళాదేవి బీడీ కార్మికురాలు. అయితే ఆర్ధిక కష్టాలతో చదువుని మధ్యలో ఆగిపోయినా చదువుపై మక్కువతో కష్టపడి చదివి ఎంఏ ఇంగ్లీష్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. తర్వాత ఎడ్ సెట్ లో రెండో ర్యాంక్ సాధించారు. బీఈడీ పూర్తి చేసి  ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. గవర్నమెంట్ మోడల్ స్కూల్ జవహర్ నగర్ లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.

 

 

లీడ్ గమనం

2007 లో దీన్ని స్థాపించారు.లీడ్ అంటే  నాయకత్వం, చదువు, లక్ష్యసాధన, గ్రామీణ విద్యార్థుల అభివృద్ధికి దారి చూపే వేదిక. కేవలం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మాత్రమే కాదు, హైస్కూల్ నుంచి కళాశాల విద్యార్థుల వరకు 15 ఏళ్ళ నుండి ప్రతి వేసవిలో ఉచిత ఇంగ్లిష్ తరగతులు నిర్వహిస్తున్నారు. వారికి కావాల్సిన మెటీరియల్ ఉచితంగా అందిస్తున్నారు. ఎవరైతే మారుమూల గ్రామాల్లోని పేద విద్యార్థులకు మార్గనిర్దేశం చేసి తగిన విధంగా పోటీ పరీక్షలకు సిద్ధం చేయడంలో లీడ్ ఎంతో కృషి చేస్తుంది.

రవి కుమార్ కేవలం లైబ్రరీని మొదలు పెట్టి కూర్చోలేదు. దానిని విద్యార్థులకు, విజ్ఞులకు మరింత చేరువ చేయడం కోసం మొబైల్ లైబ్రరీని ఏర్పాటు చేసి ఇంటింటికీ గ్రంధాలయాన్ని నడిపిస్తున్న ఋషి అని చెప్పాలి. పుస్తకాన్ని ,సమాజాన్ని ఎంతో ప్రేమిస్తే గానీ  ఇది సాధ్యం కాదు. 

రవి కుమార్ పుస్తక యజ్ఞంలో భాగం అవుదాము. మనం కూడా లైబ్రరీకి పుస్తకాలు సమకూర్చుదాము. వీలయితే ఇంకా నాణ్యమైన నిర్వహణకు మనవంతు సహాయం చేద్దాము. రవికుమార్ ఫోన్ నెంబర్ 9908311580 /7981068048

◆ వెంకటేష్ పువ్వాడ