రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్ట‌డించిన టీఆర్ఎస్‌.. త‌రిమికొట్టిన రేవంత్ అనుచ‌రులు..

కేటీఆర్ వ‌ర్సెస్‌ రేవంత్‌రెడ్డి కాక రేపుతోంది. వైట్ ఛాలెంజ్‌పొలిటిక‌ల్ హీట్ పెంచుతోంది. డైలాగ్ వార్ ముదిరి కోర్టు కేసుల వ‌ర‌కూ దారి తీసింది. నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతుంటే.. కార్య‌క‌ర్త‌లు మాత్రం నేరుగా యాక్ష‌న్‌లోకి దిగిపోయారు. మా నేత‌నే అంటారా అంటూ డైరెక్ట్‌గా త‌ల‌బ‌డుతున్నారు. తాజాగా, ప‌లువురు టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు పీసీసీ చీఫ్ ఇంటిని ముట్ట‌డించేందుకు వెళ్లింది. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ‌ను ద‌గ్థం చేయాల‌ని ప్ర‌య‌త్నించింది. అయితే, టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ను రేవంత్‌రెడ్డి అనుచ‌రులు త‌రిమి త‌రిమి కొట్ట‌డం ఉద్రిక్త‌త‌ను రాజేసింది. 

కేటీఆర్‌పై వ్యాఖ్య‌ల‌ను నిర‌సిస్తూ.. టీపీసీసీ అధ్యక్షుడి రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడించే ప్ర‌య‌త్నం చేశారు టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో ఆయన ఇంటి ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే, అనూహ్యంగా రేవంత్‌రెడ్డి అనుచ‌రుల నుంచి టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌కు గ‌ట్టి ప్ర‌తిఘ‌ట‌న ఎదురైంది.

టీఆర్ఎస్‌ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు టీఆర్ఎస్‌ శ్రేణులు ప్ర‌యత్నించగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుని కర్రలతో వెంటపడ్డారు. గులాబీ కార్యకర్తలు రాళ్లతో ఎదురు దాడి చేసేందుకు ప్ర‌యత్నించారు. అయితే, రేవంత్‌రెడ్డి అనుచ‌రులు పెద్ద సంఖ్య‌లో ఉండ‌టంతో.. టీఆర్ఎస్ తోక ముండిచింది. కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో వెంటబ‌డి.. టీఆర్ఎస్‌ కార్యకర్తలను త‌రిమి త‌రిమి కొట్టారు. 

ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.