అప్పుడు అభిమానం..ఇప్పుడు అసహనం! అమ్మకానికి కేసీఆర్ టెంపుల్.. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉద్యమ సమయంలో ఆయన మాట్లాడితే జనాలు ఊగిపోయేవారు. ఆయన ప్రసంగం వినేందుకు ఎగబడేవారు. కేసీఆర్ ప్రెస్ మీట్ ఉందంటే తెలంగాణ జనమంతా టీవీలకు అతుక్కునిపోయేవారు. కాని కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకా ఆయన క్రేజీ క్రమంగా తగ్గిపోతోంది. కొన్ని రోజులుగా కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందని వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో తేలింది. గతంలో కేసీఆర్ ను విపరీతంగా అభిమానించిన వారు కూడా ఆయనను వ్యతిరేకిస్తున్నారు. గతంలో  కేసీఆర్ ను ఎవరైనా ఏమైనా అంటే ఎదురుదాడి చేసే వాళ్లే ఇప్పుడు కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. 

కేసీఆర్ పై అభిమానంతో ఆయనకు గుడి కట్టిన ఓ అభిమాని... ఇప్పుడు కేసీఆర్ అంటేనే అసహ్యించుకుంటున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అభిమానంతో  మంచి ర్యాల జిల్లా దండేపల్లికి చెందిన ఉద్యమకారుడు రవీందర్ గుడి కట్టించాడు.  తన ఇంటి ఆవరణలో ఆ గుడి కట్టించాడు. అందులో కేసీఆర్‌ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు కూడా చేస్తున్నాడు. అలాంటి రవీందర్ ఇప్పుడు కేసీఆర్ గుడిని అమ్మకానికి పెట్టాడు.తనకు పార్టీలో గుర్తింపు లేదని, కనీసం కేసీఆర్, కేటీఆర్‌లను కలిసే అవకాశం కూడా రాలేదని.. అందుకే గుడిని, గుడిలోని కేసీఆర్‌ విగ్రహాన్ని అమ్మకానికి పెట్టానని చెబుతున్నాడు రవీందర్. 

తనకు కేసీఆర్, కేటీఆర్‌ను కలిసే అవకాశం కూడా రావడం లేదని, టీఆర్‌ఎస్‌ పార్టీలోనూ గుర్తింపు దక్కలేదని నిరాశ చెంది కొన్ని రోజుల క్రితం బీజేపీలో చేరాడు రవీందర్. అప్పటి నుంచి కేసీఆర్‌ విగ్రహానికి ముసుగు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఉద్యమంలో పాల్గొని అప్పుల పాలయ్యానని, అప్పులు తీర్చేందుకు కేసీఆర్‌ గుడిని, విగ్రహాన్ని విక్రయిస్తున్నట్లు తాజాగా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు.