మార్పు కోరుకున్న తమిళ తంబీలు
posted on Oct 19, 2015 1:11PM

తమిళనాడులో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ వర్గం ఘనవిజయం సాధించింది, పలు ఉద్రిక్తతల నడుమ జరిగిన ఎన్నికల్లో నటుడు శరత్ కుమార్ ప్యానల్ మట్టికరిచింది, సాధారణ ఎన్నికలను తలపించిన ఈ ఎన్నికల్లో తెలుగువాడైన హీరో విశాల్ ప్యానల్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది, అయితే తొమ్మిదేళ్లుగా అప్రతిహతంగా అధ్యక్షుడిగా కొనసాగుతున్న శరత్ కుమార్ పై విజయం అంత ఆషామాషీగా రాలేదు, ఎన్నో అవమానాలు, హేళనలు, తిట్లు, దాడులను తట్టుకుని విశాల్ ప్యానెల్ చివరికి విజయాన్ని సొంతం చేసుకుంది.
తెలుగువాడైన హీరో విశాల్ పూర్వీకులది తమిళనాడు సరిహద్దుల్లోని చిత్తూరు జిల్లా... అయితే ఆయన కుటుంబం ఎప్పుడో తమిళనాడులో స్థిరపడింది. అందుకే నడిగడర్ ఎన్నికల్లో విశాల్కు ప్రత్యర్థులుగా నిలిచిన శరత్ కుమార్ వర్గం... విశాల్ తెలుగువాడని, తమిళులకే మద్ధతివ్వాలని రెచ్చగొట్టారు, భాషాపరంగా తమిళనాడు వ్యక్తి కాదని అవమానించడమే కాకుండా, పోలింగ్ సమయంలో విశాల్ పై దాడికి సైతం దిగారు, అయినప్పటికీ శరత్ కుమార్ ప్యానెల్ పై విశాల్ వర్గం విజయం సాధించడం గమనార్హం. విశాల్ ప్యానెల్ లోని ప్రముఖ నటుడు నాజర్ ... శరత్ కుమార్ పై 109 ఓట్ల మెజార్టీతో గెలవగా, హీరో విశాల్.... రాజారవిపై 141 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించాడు, విశాల్ ప్యానెల్ కే చెందిన మరో నటుడు కార్తీ కూడా మంచి విజయం సాధించాడు.
అయితే తొమ్మిదేళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా నడిగర్ సంఘాన్ని నడిపిస్తున్న శరత్ కుమార్ తీరుపై విసుగుపోయిన తమిళ నటులు... విశాల్ వర్గానికి పట్టంకట్టారు, ముఖ్యంగా యువ ఓటర్లంతా విశాల్ ప్యానెల్ వైపే మొగ్గుచూపారు, ఇటీవల కాలంలో ఎన్నడూ జరగని విధంగా సాగిన నడిగర్ ఎన్నికల్లో విశాల్ ప్యానెల్ సాధించిన విజయం అపూర్వమైనది, పైగా మంచికి ఒకటే భాష, ఒకటే మతం, ఒకటే కులం అని తమిళ తంబీలు కూడా నిరూపించారు. అందుకే విశాల్ రెడ్డి... తమిళుడు కాదంటూ ప్రత్యర్ధి వర్గం ప్రచారం చేసినా... విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు.