అమరావతికి గ్లామర్ డోస్ పెంచుతున్నారు
posted on Oct 19, 2015 1:37PM

అమరావతి శంకుస్థాపనకు ముహూర్తం దగ్గరపడటంతో సినీ హంగులు అద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది, ఇప్పటికే కార్యక్రమ వ్యాఖ్యాతగా సాయికుమార్ ను ఎంపిక చేయగా, సభావేదికను సినిమా సెట్టింగ్ మాదిరిగా భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం వివిధ దేశాలు, రాష్ట్రాల్లో ప్రాచీన కళారూపాలు, సాంస్కృతిక వైభవం గురించి పరిశోధన చేసిన సేథీకి ఈ బాధ్యతలు అప్పగించారు, ఇప్పటికే ప్రధాన వేదిక అన్ని హంగులూ అద్దిన సేథీ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ.. అమరావతి ప్రాచీనత ఉట్టిపడేలా ప్రాంగణాన్ని సిద్ధంచేస్తోంది. కళాత్మకతతో పాటు అందరినీ ఆకర్షించేలా సినిమా సెట్టింగ్‌లను తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సినీ గ్లామర్ అద్దేందుకు సాధ్యమైనంత వరకు వారిని నేరుగా కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా చేస్తున్నారు. తారల తళుకుబెళుకులు, పాటలు, సంగీత కార్యక్రమాలు, నవ్వులు పండించే స్కిట్లు, సాంస్కృతిక కార్యక్రమాలతో సభికులను కట్టి పడేసే ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా ప్రముఖ నటుడు సాయికుమార్, ప్రముఖ గాయని సునీత యాంకరింగ్ చేయనుండగా, శివమణి డ్రమ్స్ ప్రోగ్రాం, భవిరి రవి స్కిట్స్ కార్యక్రమాన్ని సైతం ఏర్పాటు చేశారు. ప్రధాని రావడానికి ముందు ఈ కార్యక్రమాలన్నీ ఉండేలా ప్లాన్ చేస్తున్న అధికారులు... మోడీ వచ్చాక ఆయన ముందే... కూచిభొట్ల ఆనంద్ నేతృత్వంలో కూచిపూడి నృత్యరూపకం ప్రదర్శించనున్నారు.
అయితే అమరావతి శంకుస్థాపన వేదికలను సిద్ధంచేయాలని ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళిని సంప్రదించగా ఆయన తిరస్కరించినట్లు తెలిసింది, బాహుబలి మాదిరిగా అదిరిపోయే విధంగా సెట్టింగ్ వేయాలని అధికారులు కోరితే స్పందించలేదని, ఆ తర్వాత బోయపాటి శ్రీనును అప్రోచ్ కాగా, ఆయన కూడా ముందుకురాలేదని చెబుతున్నారు.