మహిళా కాంగ్రెస్ నేతలపై కేరళ నేత అభ్యంతరకర కామెంట్స్

 

కేరళలో వామపక్షాలకు అనుబంధ సభ్యుడుగా వ్యవహరిస్తున్న చెరియన్ ఫిలిప్ తన ఫేస్ బుక్ లో మహిళా కాంగ్రెస్ నేతల పట్ల చాలా అసభ్యకరమయిన కామెంట్స్ చేసారు. ఇటీవల కేరళలో త్రిసూరులో కొందరు యువజన కాంగ్రెస్ నేతలు ఎన్నికలలో తమకు టికెట్స్ కేటాయించకపోవడంపై పార్టీకి నిరసన తెలియజేసేందుకు చొక్కాలు ధరించకుండా అర్ధ నగ్నంగా ఒక ర్యాలీ నిర్వహించారు. దానిపై చెరియన్ ఫిలిప్ స్పందిస్తూ “కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతలు కూడా టికెట్స్ కోసం పార్టీ పెద్దలతో వ్యవహారాలు సాగించారు,” అని తన ఫేస్ బుక్ లో ఒక మెసేజ్ పోస్ట్ చేసారు.

 

కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలకు చెందిన నేతలు, కాంగ్రెస్ మహిళా నేతలు, మహిళా సంఘాలు ఆయన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్త చేసాయి. తక్షణమే ఆయన ఫేస్ బుక్ నుంచి తన వ్యాఖ్యలను తొలగించి, మహిళకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

 

కేరళ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్ దీనిపై స్పందిస్తూ “ఇటువంటి వ్యాఖ్యలు సదరు వ్యక్తుల సంస్క్రతికి అద్దం పడుతుంటాయి. సంస్కృతి, సంస్కారం ఉన్నవాళ్ళు ఎవరూ మహిళల పట్ల ఇటువంటి వ్యాఖ్యలు చేయరు. ఈ విధమయిన మాటలు మాట్లాడేవారికి ప్రజలే సరయిన బుద్ధి చెపుతారు,” అని అన్నారు.

 

చెరియన్ ఫిలిప్ చేసిన ఈ అభ్యంతరకర వ్యాఖ్యలని అందరూ ముక్త కంఠంతో తప్పుపడుతున్నప్పటికీ, ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా తనకు నిజ నిర్ధారణ (లై డిటెక్టర్) పరీక్ష నిర్వహించవలసిందిగా ప్రభుత్వానికి సవాలు విసిరారు. తనకు పరీక్షలు నిర్వహించినట్లయితే, మహిళా కాంగ్రెస్ నేతలు ఎవరెవరు టికెట్ల కోసం సాగించిన చీకటి వ్యహారాల గురించి తన మనసులో రహస్యంగా దాగి ఉన్న రహస్యాలన్నీ బయటపడతాయని అన్నారు. దాని వలన సదరు కాంగ్రెస్ నేతలే సమాజం ముందు సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. అంటే ఆయన మహిళా కాంగ్రెస్ నేతలపై చేస్తున్న ఆరోపణలకు పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు ద్రువీకరిస్తున్నట్లు ఉంది.

 

ఆయన మహిళా కాంగ్రెస్ నేతలపై తీవ్ర అభ్యంతరకర ఆరోపణలు చేస్తుంటే, దానిని అడ్డుకోవలసిన సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, “చెరియన్ ఫిలిప్ చేసిన వ్యాఖ్యలు మహిళలు అందరినీ ఉద్దేశ్యించి అన్నవి కావు. ఆయన మహిళా వ్యతిరేకి కాదు,” అని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu