వర్షం పడితే ‘అ’భాగ్యనగరమే!

అవే అవస్థలు, అవే సమస్యలు, అవే కష్టాలు, అవే ఇబ్బందులు..  చినుకు పడితే చాలు భాగ్యనగరం ప్రజలు తాము అభాగ్యులం అన్న భావనలోకి జారిపోయే పరిస్థితి.  రోడ్లు చెరువలు అవుతాయి. ఇళ్లళ్లో మోకాలి లోతు నీరు నిలిచిపోతుంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. హైదరాబాద్ మహానగరంలో వర్షం పడిన ప్రతి సారీ ఇదే పరిస్థితి. నాలాల ఆక్రమణలు, అక్రమ కట్టడాలే ఇందుకు కారణమనీ, వాటిపై ఉక్కుపాదం మోపుతామనీ ప్రతి సారీ ప్రభుత్వం చెబుతూనే ఉంటుంది. తరువాత అంతా మామూలే. వాన పడిందంటే అవే ఇబ్బందులు, అవే కష్టాలు. విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధి అంటూ గప్పాలు కొట్టుకోవడమే తప్ప చినుకు పడితే ఆ విశ్వనగరం కాస్తా విశ్వనగరంగా మారిపోతున్నా పట్టించుకోరు అన్న విమర్శలు నగరవాసుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

రోడ్లు, డ్రైజేజీలు మరమ్మతులు జరుగుతున్న ప్రాంతాలలో జీహెచ్ఎంసీ ఘనంగా  మీ పన్నులతో జరుగుతున్న అభివృద్ధి అని అర్ధం వచ్చేలాంటి బోర్డులను ఏర్పాటు చేస్తున్నది. అయితే ఆ అభివృద్ధి గొప్పతనం బండారం ఒక వర్షం పడితే చాలు బయటపడిపోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే భాగ్యనగరం సోమవారం సాయంత్రం మరో సారి అనుభవించింది. సోమవారం సాయంత్రం భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది.

అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో విశ్వనగరం చిగురుటాకులా వణికింది. నగరంలోని పలు ప్రాంతాలలో ఓ రెండు గంటల వ్యవధిలో సగటున ఆరు సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమై జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు చెరువులను తలపించాయి. గంటల తరబడి కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, దసరా పండుగ షాపింగ్‌ కోసం వాహనాలతో బయటకు వచ్చిన వారు నరకయాతన అనుభవించారు. సరూర్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, మలక్‌పేట్‌, కోఠి, మొజాంజాహి మార్కెట్‌, లక్డీకాపూల్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎర్రగడ్డ, బేగంపేట్‌, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, హైటెక్‌ సిటీ, జేఎన్‌టీయూ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది.

ఉప్పల్‌, రామంతాపూర్‌, సరూర్‌నగర్‌, మలక్‌పేట్‌, నాంపల్లి, గన్‌ఫౌండ్రీ, మెహిదీపట్నం, గణాంకభవన్‌, ఆసి్‌ఫనగర్‌, అల్కాపురి కాలనీల్లో 7 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది.   నాంపల్లిలో 9.3 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షానికి  మూసారాంబాగ్‌ వంతెన నీట ముని  ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu