హైదరాబాద్‌లో భారీ వర్షానికి కూలిన గోడ... కార్ల ధ్వంసం
posted on Sep 18, 2025 8:43PM
.webp)
హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చెరువులు పొంగిపొర్లుతుండగా, లోతట్టు కాలనీలు వరద నీటితో మునిగిపోయాయి.
* మైసమ్మగూడ చెరువులో దుర్ఘటన
ఈ ఉదయం పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మైసమ్మగూడ చెరువులో రెండు మృతదేహాలు తేలియాడుతున్నాయని స్థానికులు గమనించి 100 డయల్‌కు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, హైడ్రా సిబ్బంది అక్కడికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు.
ప్రాధమిక దర్యాప్తులో అవి బహదూర్‌పల్లి ఇందిరమ్మకాలనీకి చెందిన అశోక్ (50), అతని కుమార్తె దివ్య (5)గా గుర్తించారు. ఈ ఘటనపై అశోక్ భార్య సోనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
* హబీబ్‌నగర్‌లో గోడ కూలి కార్లు ధ్వంసం
మరోవైపు హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని స్మశాన వాటిక గోడ ఒక్కసారిగా కూలిపోయింది. గోడకు ఆనుకొని పార్క్ చేసిన మూడు కార్లపై అది పడడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడగా, పోలీసులు, మున్సిపల్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని కూలిన గోడను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.
* అసిఫ్‌నగర్ – తల్లగడ్డ ప్రాంతాల్లో వరద ఉధృతి
అసిఫ్‌నగర్, తల్లగడ్డ ప్రాంతాల్లో వరదనీరు రోడ్లమీద పొంగిపొర్లుతోంది. లోతట్టు ఇళ్లలోకి కూడా నీరు చొచ్చుకెళ్తోంది. వాహనదారులు జాగ్రత్తలు పాటించకుండా వరద మధ్యలో ప్రయాణించడంతో వాహనాలు నీటిలో ఇరుక్కుంటున్నాయి. ఒక బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వరద గల్లీలో చిక్కుకుపోగా, గోడపైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. హైడ్రా, ఫైర్ శాఖ సిబ్బంది వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
* దోమలగూడలో నీటిముగ్గు
నిన్నటి నుండి దోమలగూడ స్ట్రీట్ నంబర్ 7 ప్రాంతంలో వరద నీరు అలాగే నిలిచిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా & హైదరాబాద్ జిల్లా ఫైర్ శాఖ అధికారి నారాయణ అక్కడికి చేరుకొని పరిసరాలను పర్యవేక్షించారు.
ఏవీ కాలేజ్, గగన్‌మహల్ ఎగువ ప్రాంతాల నుండి వచ్చిన వర్షపు నీరు దోమలగూడ, సూరజ్‌నగర్ కాలనీ, రాజ్‌మహల్ ప్రాంతాల్లో చేరి నిల్వ అయింది. మోటార్ పంపుల సహాయంతో నీటిని తరలించేందుకు టీములు రంగంలోకి దిగాయి. వాటర్ లాగింగ్ తొలగించే వరకు ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
* అధికారులు జాగ్రత్త సూచనలు
హైడ్రా, ఫైర్ శాఖ, మున్సిపల్ అధికారుల బృందాలు నగరంలోని కీలక ప్రాంతాల్లో పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి. ప్రజలు వరద ప్రాంతాల్లోకి వెళ్లరాదని, అవసరమైతే సహాయక బృందాలను సంప్రదించాలని సూచించారు.