డాక్టర్ సుధాకర్ కుటుంబానికి రూ.కోటి.. కుమారుడికి ప్రమోషన్!
posted on Jan 9, 2026 9:38AM

ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో అత్యంత అమానవీయంగా వేధింపులకు గురై ఆ మానసిక క్షోభతో మరణించిన డాక్టర్ సుధాకర్ కుటుంబానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రభుత్వ డాక్టర్ అయిన సుధాకర్ కు జగన్ హయాంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఆయన కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. అలాగే డాక్టర్ సుధాకర్ కుమారుడిని పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది.
జగన్ హయాంలో డాక్టర్ సుధాకర్ ప్రభుత్వ వైద్యులకు కరోనా మహమ్మారి నుంచి రక్షణకు కనీసం మాస్కులు కూడా ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించడమే జగన్ ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టడానికి కారణమైంది. ప్రభుత్వ డాక్టర్ అని కూడా చూడకుండా.. విశాఖపట్నం వీధుల్లో ఆయనను అర్థనగ్నంగా చేసి, చేతులు వెనక్కి విరిచి కట్టి పోలీసులు ఈడ్చుకెళ్లిన దృశ్యాలు అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. తన విధి నిర్వహణలో భాగంగా ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు ఆయనపై పిచ్చివాడు అన్న ముద్రవేసి, ఆసుపత్రికి పంపడం వంటి అత్యంత అమానవీయ చర్యలకు అప్పటి జగన్ ప్రభుత్వం పాల్పడింది. ఆ మానసిక వేదన, ఆ అవమానంతోనే ఆయన కన్నుమూశారు.
నాడు డాక్టర్ సుధాకర్ అనుభవించిన నరకయాతనను విపక్ష నేతగా ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పరంగా డాక్టర్ సుధాకర్ కుటుంబానికి సహకారం అందించాలని నిర్ణయించారు. ప్రస్తుతం సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ కుమారుడు సి.కె. లలిత్ ప్రసాద్‌కు విద్యార్హతలను బట్టి నేరుగా పదోన్నతి కల్పించాలని గురువారం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు. అలాగే ఆయన కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సహాయం అందించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.