కోడి రక్తంతో జగన్ ఫ్లెక్సీకి అభిషేకం.. తిరుపతిలో ఇద్దరు అరెస్టు
posted on Jan 9, 2026 8:11AM

తిరుపతిలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలనుపోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ అధినేత జన్మదినం సందర్భంగా వారు చేసిన చర్య ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంతకీ వారేం చేశారంటే.. మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి కోడి రక్తంతో అభిషేకం చేసి, ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తిరుపతి కట్టకిందపల్లెకు చెందిన నల్లందుల బాలసుబ్రహ్మణ్యం, ప్రైవేట్ ఉద్యోగి భువనకుమార్ రెడ్డి గత డిసెంబర్ 21న కొత్తపల్లి కూడలి వద్ద జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అదే రాత్రి ఒక కోడిని తెచ్చి, దాన్ని గొంతు కోసి ఆ రక్తాన్ని జగన్ ఫ్లెక్సీపై చల్లారు. ఈ దృశ్యాలను వీడియో తీసి, దానికి రక్తచరిత్ర సినిమాలోని హింసాత్మక పాటను మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, సంఘటన జరిగిన పక్షం రోజుల తర్వాత ఈ విషయంపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి గురువారం (జనవరి 8) వారిరువురినీ అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
నిందితుల్లో ఒకరైన బాలసుబ్రహ్మణ్యం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సమీప బంధువు. నిందితులు కోర్టుకు వచ్చిన సమయంలో వారిని పరామర్శించేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి కోర్టుకు వచ్చి వారికి సంఘీభావం ప్రకటించారు. కాగా కోర్టు వారిరువురికీ బెయిలు మంజూరు చేసింది.