పదేళ్లలో పర్యాటకంలో ఏపీ నంబర్ వన్.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2024లో చంద్రబాబునాయుడు అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి పరుగులు పెడుతోంది.  రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగానే  విజయవాడలో మూడు రోజుల పాటు అమరావతి ఆవకాయ్  ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది. గురువారం (జనవరి 9)న ప్రారంభమైన అమరావతి- ఆవకాయ్ ఫెస్టివల్ లో  సీఎం నారా చంద్రబాబు నాయుడు, యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  తెలుగు వారి ఆతిథ్యం, రుచి, క్రియేటివిటీ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటాయన్నారు.  

పర్యాటక రంగాన్ని  ఆర్థిక వనరుగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు, రానున్న పదేళ్లలో  పర్యాటకంలో ఏపీని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామన్నారు.   సూర్యలంక బీచ్‌ను గోవా తరహాలో అభివృద్ధి చేస్తామనీ,  పోలవరం పాపికొండలు, అరకు, గండికోట ఉత్సవాల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తామన్నారు. ఇక అరకు కాఫీ ఇప్పటికే గ్లోబల్ బ్రాండ్‌గా మారిందని గుర్తు చేశారు.  రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందనీ, పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయన్నచంద్రబాబు, దేశానికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో పాతిక శాతం ఆంధ్రప్రదేశ్ కే దక్కాయనీ, ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక తేటతెల్లం చేసిందని అన్నారు.   పీపీపీ విధానంలో కేంద్రం చేపడుతున్న ప్రాజెక్టుల్లో 30 శాతం ఏపీలోనే ఉన్నాయన్న ఆయన. అమరావతిని ప్రపంచంలోనే బెస్ట్ డైనమిక్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు.

పర్యాటకం అభివృద్ధి చెందడంలో భద్రత, శుభ్రత కీలకపాత్ర వహిస్తాయన్నారు.  ఇక రాష్ట్ర పర్యాటకంలో తెలుగు సినీమా కూడా ప్రధాన పాత్ర పోషించాలన్నారు.  క్రియేటివిటీకి తెలుగు సినిమా చిరునామా అన్న విషయాన్ని   భక్త ప్రహ్లాద నుంచి బాహుబలి వరకు సాధించిన విజయాలే  నిదర్శమన్నారు.   ఎన్టీఆర్ నుంచి ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, ఎస్వీఆర్, చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బాలయ్య వరకు హీరోలందరూ ఈ ప్రాంతం వారే కావడం గర్వకారణమన్నారు.    గత ప్రభుత్వం సాంస్కృతిక ,  వినోద కార్యకలాపాలను పూర్తిగా విస్మరించిందని విమర్శించిన చంద్రబాబు, రాష్ట్ర గొప్ప వారసత్వాన్ని హైలైట్ చేయడానికి తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహించిందని చెప్పారు.    విజయవాడ ఉత్సవ్ మరియు కనక దుర్గ ఉత్సవ్‌లను ఆయనీ సందర్భంగా ప్రస్తావించారు.   

 అమరావతి- ఆవకాయ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న యూరోపియన్ యూనియన్  రాయబారి హెర్వే డెల్ఫీ సాంకేతికంగా, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్  వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. సెమీ కండక్టర్స్, ఏఐ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. త్వరలో ఏపీలో  ఈయూ ఫిలిం ఫెస్టివల్' నిర్వహించనున్నట్లు చెప్పారు. రాజమౌళి తీసిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు తానూ చూశానని, 'నాటు నాటు' పాట తనను ఎంతో ఆకర్షించిందని డెల్ఫీ పేర్కొన్నారు. సంప్రదాయం, సంస్కృతిని మేళవిస్తూ   నిర్వహిస్తున్న ఆవకాయ ఫెస్టివల్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వ్యవసాయంలో, నైపుణ్యంలో, ఆర్ధిక వృద్దిలో పెట్టుబడులతో ఏపీని లీడింగ్ స్టేట్ గా అభివర్ణించిన ఆయన, ఈ డైనమిజమే యూరోపియన్ యూనియన్ ను విశేషంగా ఆకట్టుకుంటోందని అన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu