డబ్బు లోకానికి వైద్యం!


ఈ ప్రపంచంలో మనిషి బతకడానికి డబ్బు ఎంతో అవసరం. ఒకప్పటి కాలంలో మనిషి జీవితానికి ఇప్పటి మనిషి జీవితానికి తేడా గమనిస్తే కాలానుక్రమంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిలో కొన్ని ప్రాధాన్యతలు పెరిగాయి. మరికొన్ని తగ్గిపోయాయి. అలాంటి వాటిలో ప్రథమ స్థానంలో ఉండేది డబ్బు. ఒకప్పుడు డబ్బు మనిషి అవసరం. అంతకు ముందు కాలంలో డబ్బు అనేది అంతగా అవసరం లేకుండా ఉండేది. అన్నీ వస్తుమార్పిడి ద్వారా జరిగిపోయేవి. ఆ తరువాత కొన్నిటి విలువ పెరుగుతూ  ఉన్నప్పుడు, చాలా వస్తువులు అరుదుగా మారిపోయినప్పుడు వాటిని డబ్బుకు అమ్మడం ఆ డబ్బుతో అవసరం అయిన వేరేవి కనుక్కోవడం చేసేవారు. ఆ డబ్బును క్రమంగా పొదుపు చేయడం మొదలుపెట్టాకా వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతుండగా డబ్బు ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. అలా మొదలైన డబ్బు ప్రస్థానం నేడు డబ్బే లోకంగా బతుకుతున్న మనుషులను తయారుచేసింది.

డబ్బుకు లోకం దాసోహం అన్నా, డబ్బెవరికి చేదు అన్నా అదంతా డబ్బును మనుషులు చూస్తున్న కోణం ఆధారంగా చెప్పిందే.

అసలు ఎందుకింత ప్రాధాన్యత!

మనుషులు కరెన్సీ కాగితాలలో తమ జీవితాలను మెరుగ్గా చూసుకోవడం మొదలుపెట్టాకా ఆ కాగితాల హవా పెరిగిపోయింది. క్రమంగా మనిషి కష్టాన్ని కూడా ఆ కాగితాలు శాసించే స్థాయికి చేరాయి. ఫలితంగా  శ్రమదోపిడి వ్యవస్థ అంతకంతకూ పెరుగుతూ పోయింది. ఇక ప్రస్తుతం గురించి చెబితే కాగితాల వల్లనే మర్యాద, గౌరవం కూడా పొందుతున్న వాళ్ళు, ఆ డబ్బు వల్లనే గౌరవం, మర్యాద ఇస్తున్నవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఫలితంగా డబ్బు చుట్టూ లోకం తిరుగుతూ ఉంది, 

చేస్తున్న తప్పులు?

మనుషులు ఒక తప్పుకు అలవాటు పడిపోయారు. అదేంటంటే మనిషిలో ఆలోచనను విజ్ఞానాన్ని పెంపొందించే విద్యను ఆదాయవనరుగా మార్చడం ఒకటైతే, ఆ చదువుతోనే డబ్బు సంపాదన సాధ్యం అనుకునే ఆలోచన కూడా మరొకటి. నిజానికి పెరుగుతున్న అభివృద్ధి దృష్ట్యా మనిషి ఎన్నో రకాల రంగాలలో ఎన్నో విధాలైన శిక్షణలు తీసుకోవడం వల్ల ఆయా రంగాలలో అవకాశాలు పొందగలుగుతున్నారు. అయితే ఎటు తిరిగి దాన్ని వృత్తిగా కాకుండా మనిషి జీవితాలకూ, ముఖ్యంగా మానసిక బంధాలను కూడా డబ్బుతో పోల్చి చూడటం మాత్రం ఎంతో దారుణమైన విషయం. ఇప్పటి కాలంలో అక్క, చెల్లి, తమ్ముడు, అమ్మ, నాన్న  ఇలాంటి రక్తసంబంధాలు కూడా డబ్బు ముందు వెలసిపోతున్నాయంటే అది డబ్బు తప్పు కాదు మనిషి తప్పు అని అందరికీ తెలుసు. 


మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి అని చెప్పే కొందరు కూడా ఆ డబ్బు ఉన్నపుడు ఒకలా అది లేనప్పుడు మరొకలా ఉండటం చూస్తే నవ్వొస్తుంది కూడా.


సుమతీ శతకకర్త బద్దెన అంటాడు….


సిరి దా వచ్చిన వచ్చును

సలలితముగ నారికేళ సలిలము భంగిన్

సిరి దా బోయిన బోవును

కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!!


సిరి అంటే డబ్బు. ఆ లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తాం. ఆ డబ్బు కొబ్బరికాయలో నీళ్లు వచ్చి చేరినట్టు ఎంతో నిశ్శబ్దంగా వస్తుంది. ఆ తరువాత ఏనుగు వెలగపండు నోట్లో వేసుకుని లోపలి గుజ్జు ఎలా మాయం చేస్తుందో అలాగే డబ్బు కూడా వెళ్ళిపోతుంది. 


డబ్బు వచ్చేవరకు ఎవరికీ ఎలాంటి ఆర్భాటాలు ఉండవు. కానీ ఆ డబ్బు చప్పుడు అవ్వగానే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టే అవుతుంది పరిస్థితి. ఆ తరువాత డబ్బు అయిపోయాక కాళీ వెలగపండులా ఏమిలేకుండా అయిపోతుంది పరిస్థితి. మరి అలా వచ్చి మనిషిని వ్యామోహాలకు లోను చేసి ఆ తరువాత విసిరేసినట్టు చేసే డబ్బుకు మనుషులు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరమా?? అని ఆలోచిస్తే తమ పిల్లలకు డబ్బే లోకం కాదు ఈ లోకం ఎంతో ఉంది అని అనుభవపూర్వకంగా తెలియజేప్తు ఉంటే కుటుంబాలు బాగుంటాయి. డబ్బుకు కూడా విలువ ఇచ్చినట్టే. 


నిజం!! డబ్బును ఆశించడం తప్పు కాదు కానీ, దాన్ని ఎలా వాడాలో అలా వాడుకున్న వాడికి ఆ డబ్బు కూడా  తన పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తూ ఉంటుంది.


◆ వెంకటేష్ పువ్వాడ.