వివేకం లేని విద్య ఎవ్వరికీ ఉపయోగం?

సమాజంలో విద్య పాత్ర చాలా గొప్పది. విద్య కలిగినవాడి మార్గం వేరుగా ఉంటుంది. జీవితంలో గొప్ప ఉద్యోగ అవకాశాలను పొందాలి అంటే విద్య కూడా గొప్పగానే ఉండాలి. 

మనిషి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి విద్య చాలా అవసరం. విటువలులేని విద్య వల్ల వచ్చే ప్రయోజనం శూన్యం! విజ్ఞానం ద్వారా మానవాళికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుత సమాజంలో విలువలతో కూడిన విద్య సమాజానికి చాలా అవసరం. కానీ ఎక్కడా విలువలు అనేవి విద్యలో అంతగా కనిపించడం లేదు. కారణం విద్యను ఒక వ్యాపారంగా మార్చేయడం. విద్య అనేది ప్రగతిశీలకంగా చైతన్యంగా ఉన్నప్పుడే విద్యకు విలువ అనేది ఉంటుంది. భవిష్యత్ కార్యక్రమాలకు కూడా విద్య ద్వారా అందే ఫలాలు అందరికీ చేరతాయి. కొంతమంది విద్యాలయాల్లో కాకుండా స్వతంత్రంగా చదివి పైకి వచ్చినవారు ఉన్నారు. దూరవిద్య, ఓపెన్ యూనివర్శిటీల ద్వారా ముందుకు సాగుతూ ఉన్నారు కొందరు.

విద్య అనేది వివేకాన్ని ఇవ్వాలి. వివేకం లేని విద్య ఎవ్వరికీ ఉపయోగపడదు. ఎందుకంటే అందరూ విద్యా వంతులైతేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. విద్యారంగం విస్తరింపబడుతుంది. దేశ ప్రగతికి, సమాజ శ్రేయస్సుకూ సాంకేతిక వృత్తి, వైద్య విద్యా రంగాలకు ప్రాధాన్యం ఇవ్వ వలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందరూ దీనిని ముక్త కంఠంతో ఆమోదిస్తున్నా అమలుచేయడంలో మాత్రం అలసత్వమే ఎదురవుతోంది. అర్హతలు లేనివారు అందలం ఎక్కటం, విలువలు తక్కువైన విద్య, గుర్తింపు లేని విద్యాలయాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. 

మేధావులు సలహాలూ సంప్రదింపులూ లేకుండా, కేవలం కార్యనిర్వాహక పదవులలో ఉన్నవారు. చేసే నిర్ణయాల వల్ల హాని జరుగుతుందని గుర్తించే నాటికి జరగవలసిన హాని జరిగిపోతుంది. అందుకే ఎక్కడ చూసినా అర్హత లేనివాళ్ళు ఉంటున్నారు. ప్రభుత్వనేతల రాజకీయాల ప్రాతిపదికతో కాకుండా ప్రతిభ ఆధారంగా, సమర్థులను ఈ రంగంలోకి తీసుకువస్తే విద్యా వ్యవస్థలో మార్పులకు అవకాశం ఉ ఉంటుంది. పాఠశాలలు, కళాశాలల్లో జరిగే బోధనా కార్యక్రమంతోనే విద్య యొక్క పరమావధి పూర్తిగా నెరవేరింది అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే వ్యక్తిగత అనుభవాల ద్వారా, ప్రపంచ జ్ఞానం ద్వారా, అలవాట్ల ద్వారా కూడా విద్య సమకూరుతుంది.

ప్రపంచాన్ని అర్ధం చేసుకోవటానికి, ఆలోచనా పరిధిని పెంచుకోవటానికి విద్య ఉపయోగపడాలి. విద్య మనకు వినయాన్ని, సంస్కారాన్ని ఇవ్వాలి. విద్య ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్, నిర్వహణా సమర్ధ్యం, నాయకత్వ పటిమ పెంపొందాలి. విద్య అనేది సమగ్ర వ్యక్తిత్వానికి పునాదిగా నిలవాలి. విలువలు లేని విద్య నిరర్ధకము. విద్యతో పాటు విలువలు కూడా నేర్చుకోవాలి. విద్యావంతులైన యువతీ యువకులు విశ్వమానవ సౌభ్రాతృత్వానికి, విశ్వశాంతికి, సమాజ వికాసానికి, దేశాభివృద్ధికి కృషి చేస్తూ  తమ ఉన్నత విద్య ద్వారా విదేశాలలో సైతం గౌరవం, ఆదరణ పొందాలి. విద్య ద్వారా సంస్కారవంతులు, గుణవంతులైన వారు తయారౌతారు విద్య జీవనోపాధిగా ఉండటమే కాక, జీవన పరమావధిగానూ ఉండాలి.

అందుకే విద్య వస్తే సరిపోదు. దానికి విలువలు ముఖ్యం.

                                        ◆నిశ్శబ్ద.