సుఖానికి నిర్వచనం!! 

 

ప్రతి మనిషి జీవితంలో సంతోషంగా ఉండాలనే అనుకుంటాడు. బాధలు దగ్గరకి వచ్చినా అవి ఎప్పుడు వెళ్లిపోతాయా అని ఆలోచిస్తాడు. ఆవైపుగా పరిష్కారాలు మొదలుపెట్టేస్తాడు. అయితే సుఖం గురించి భగవద్గీతలో కృష్ణుడు ఇలా చెబుతాడు.

సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభః అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాస్తం చ నిగచ్ఛతి||

ఈ లోకంలో ఎల్లప్పుడూ దుఃఖము విషాదము కష్టములే కాదు సుఖాలు కూడా ఉన్నాయి. ఆ సుఖాలు ఎక్కువయి, ఒక వేళ ఆ సుఖాలు తొలగిపోతే కలిగే దుఃఖాలు కూడా ఉన్నాయి. ఆ సుఖాలు కూడా మూడు విధాలుగా విభజింపబడ్డాయి. 

సుఖం మానవుని సహజ గుణం. మానవుడు సాత్విక కర్మల చేత సుఖాన్ని పొందుతాడు. అప్పటి కే ఉన్న దుఃఖములను పోగొట్టుకుంటాడు. ఇది మానవుని కర్తవ్యము. కాని మానవులు తమ అజ్ఞానం వలనా, తాము చేసే రాజన, తామన కర్మల వలన దుఃఖములను కొని తెచ్చుకుంటున్నారు. రాజన గుణం కలవాడికి వాడు చేసే కర్మల వలన సుఖం లభిస్తుంది. తామస గుణం కలవాడికి, నిద్రలో, నిద్రలాంటి మత్తులో సుఖం లభిస్తుంది. కాబట్టి మానవులు అనుభవించే సుఖము ఎలా వస్తుంది అంటే వాళ్లు చేసే పనుల వలన వస్తుంది. అందుకే.. మానవులు అందరూ "నేను సుఖంగా ఉన్నాను" అనే భావన ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. దీనినే పాజిటివ్ తింగింగ్ అని అంటారు. దానికి అవసరమయ్యేది అధ్యాత్మ విద్య, దానిని అభ్యాసం చేస్తే నిరంతరం సుఖం కలుగుతుంది. సుఖాలను పొందడం దుఃఖాలను పోగొట్టుకోవడం మన చేతిలో ఉంది. 

అది కేవలం అభ్యాసం వలననే వస్తుంది కానీ మాటల వలన రాదు, తినడం కొంత మందికి సుఖం ఇస్తుంది. కాని ఏది తినాలి అనేది మన చేతుల్లో ఉంది. మితంగా తింటే సుఖం. ఎక్కువగా తింటే దుఃఖం. నీరు తాగితే దాహం తీరి సుఖం ఇస్తుంది. కాని తాగకూడనివి తాగితే దాహం ఎక్కువ అవుతుంది. మత్తు వస్తుంది. ఇంకా ఎక్కువ తాగితే కక్కేస్తాడు. తరువాత అనారోగ్యం కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ మన అలవాట్లు. ఈ అలవాట్లు మంచివి అయితే పరవాలేదు. కాని చెడ్డవి అయితే దుఃఖం తెచ్చిపెడతాయి.

ఇక్కడ ఒక పదం వాడాడు. దుఃఖాస్తం చ నిగచ్ఛతి. ఎవడు ఏ పని చేసినా, సుఖపడటానికే చేస్తాడు కానీ దుఃఖ పడటానికి చెయ్యడు. పైగా ఉన్న దుఃఖాలను పోగొట్టుకోవడానికి ప్రయాస పడతాడు. అంటే దుఃఖం అంతం అయితే సుఖం దానంతట అదే వస్తుంది. అది మానవ సహజం. కాని తన అవివేకం వలన ఉన్న సుఖాలు రాకపోగా, కొత్త దుఃఖాలు వచ్చిపడుతున్నాయి. ఒక్కోసారి ఈ దుఃఖాలకు అంతం లేదా అనిపిస్తుంది.


 మనంకొన్ని ప్రశ్నలు వేసుకుంటే….. 


దుఃఖమునకు అంతం ఎప్పుడు??


దుఃఖము లేని చోటు ఎక్కడ ఉంది??


దుఃఖములు ఎక్కడ అంతం అవుతాయి??

శాశ్వత సుఖం ఎక్కడ దొరుకుతుంది??

శాశ్వత సుఖం ఏం చేస్తే లభిస్తుంది?? ఎవరి వలన లభిస్తుంది??

ఈ ప్రపంచంలో దొరికే వస్తువులతో, అనుభవించే విషయ వాంఛలతో సుఖం దొరుకుతుందా?? 

ఈ ప్రశ్నలకు అన్నిటికీ ఒకటే జవాబు, సుఖము, దుఃఖము, ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి. మన భావనలో ఉన్నాయి. మనం చేసే కర్మలలో ఉన్నాయి. మనలను మనం సంస్కరించుకుంటే, అంటే మనల్ని మనం సరిచేందుకుంటే శాశ్వత సుఖం దానంతట అదే వస్తుంది. సుఖం కోసం ఎక్కడా వెదకవలసిన పని లేదు. అందుకే సుఖం కావాలంటే అభ్యాసం చేయాలి. మంచి అలవాట్లు చేసుకోవాలి అని అన్నాడు గీతలో కృష్ణుడు.

◆ వెంకటేష్ పువ్వాడ