ముద్దులకొడుకు ముచ్చట కోసం పార్లమెంటు బంద్ చేసినా తప్పేనా?
posted on Aug 12, 2015 4:45PM
.jpg)
కాకి పిల్ల కాకికి ముద్దు. సోనియాగాంధీకి రాహుల్ బాబు అంటే ముద్దు. అందుకే ఆమె తన ముద్దుల కొడుకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర్చొనేందుకు వీలుగా ప్రధాని కుర్చీలో డా. మన్మోహన్ సింగ్ ని కూర్చోబెట్టి ఆమె రిమోట్ తో దేశాన్ని పాలించారు. కానీ పదేళ్ళపాటు ఎదురు చూసినా రాహుల్ బాబు ఆ కుర్చీలో కూర్చొనే సాహసం చేయలేకపోవడంతో, ఆయన తన కుర్చీకి అంటిన బొగ్గు మసి దులుపుకొంటూ రోజులు దొర్లించేసారు. తీరా రాహుల్ బాబుకి ఆ కుర్చీలో కూర్చోవాలనే మనసు పుట్టేసరికి పుణ్యకాలం కాస్తా పూర్తయిపోయింది.
పోనీ మమ్మీ కుర్చీలోనయినా కూర్చోందామని ముచ్చటపడితే ‘నీకు అంత సీన్ ఉందా?” అని వెనక నుండి ఎవరో గుసగుసలు ఆడుకోవడం చూసి ఆయన చాలా హర్ట్ అయిపోయి ఫారిన్ వెళ్లిపోయారు. “ఉద్యోగులు శలవులు పెట్టడం చూశాము కానీ దుక్కలా ఉన్న రాజకీయ నాయకులు రాజకీయాలకు, పార్టీకి శలవులు పెట్టడం మేమెన్నడూ చూడలేదు స్మీ!” అంటూ గిట్టనివాళ్ళు బుగ్గలు నొక్కుకొన్నారు. “లోకులు కాకులు వంటివారు...వారు అరుస్తూనే ఉంటారు...వాళ్లకి భయపడితే జీవితంలో ఇక ఏ కుర్చీలోనూ మనం కూర్చోలేము” అని ఫారిన్ లో ఉపదేశం పొందిన రాహుల్ బాబు తిరిగివచ్చి తన పవర్ ఏమిటో చూపించాలని ఫిక్స్ అయిపోయాడు.
ఫారిన్ నుండి వస్తూనే రైళ్ళలో జనరల్ కంపార్ట్ మెంటులో ఎక్కి చీమిడి ముక్కులున్న పిల్లలను గుర్తించి వాళ్ళని ఒళ్లో కూర్చోబెట్టుకొని జనాలతో మమేకం అయిపోయారు. ఆ తరువాత కాళ్ళు నొప్పులు పుట్టేవరకు వరకు పాదయాత్రలు చేసి తమ హయాంలో ఆత్మహత్యలు చేసుకొన్నా రైతుల కుటుంబాలను ఓదార్చడం మొదలుపెట్టారు. కానీ దానికి అంతెక్కడ?ఆయన జీవితాంతం పాదయాత్రలు చేసినా పూర్తవదు. అయినా కూడా ఓదార్పు యాత్రలు కంటిన్యూ చేసేవాడే కానీ మధ్యలో పార్లమెంటు సమావేశాలు వచ్చి పడ్డాయి.
తనకు బాగా పట్టున్న భూసేకరణ బిల్లు-సవరణలు-నష్టాలు, మహిళా సాధికారత, దేశాభివృద్ధి, నీతి నిజాయితీ అనే అంశాల మీద మాట్లాడి అందరినీ ఆకట్టుకొనే అవకాశం ఉన్నప్పటికీ, మోడీకి తన పవర్ ఏమిటో రుచి చూపించాలని ఫిక్స్ అయిపోవడంతో ‘పార్లమెంట్ బంద్’ కి పిలుపునిచ్చారు. రాజకీయాలలో శలవులు పెట్టుకోవచ్చేమో కానీ పార్లమెంటుకి బందులు చేయడం వీలుపడదు కనుక ఓ ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక కేంద్రమంత్రి పేర్లు చెప్పి వాళ్ళందరినీ తక్షణమే డిస్మిస్ చేయాలని లేకుంటే పార్లమెంటు బంద్ తప్పదని ప్రకటించేశారు.
అప్పటి నుండి పార్లమెంటు బంద్ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ ఎంపీలు సభలో రభస చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై లోక్ సభలో చర్చ జరుగుతున్న సమయంలో సోనియమ్మ కనుసైగ చేస్తే కిక్కురుమనకుండా కూర్చోండిపోయిన జేడీ శీలం వంటివాళ్ళు కూడా ఇప్పుడు లోక్ సభలో హెడ్ ఫోన్స్ పెట్టుకొన్న వారి చెవుల్లో నుండి రక్తాలు కారిపోయేంత గట్టిగా నోరు పెట్టుకొని అరుస్తుండటం చూసి, మరి ఆనాడు రాష్ట్రం కోసం వీళ్ళందరూ ఇలాగ ఎందుకు మాట్లాడలేకపోయారు? అని జనాలు ఆశ్చర్యపోతున్నారు.
“ముద్దుల కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం రాష్ట్రాన్నే రెండు ముక్కలు చేయగాలేనిదీ, పార్లమెంటు బంద్ చేయలేమా...కొడుకు పవర్ ఏమిటో లోకానికి తెలియాలంటే ఆ మాత్రం ఎంకరేజ్ చేయకపోతే ఎలాగా?” అనుకొన్న సోనియమ్మ అంత వయసులో కూడా రోడ్డు మీద నిలబడి ‘ముర్దాబాద్’ అంటూ నినాదాలు చేసారు. కొడుకు కోసం ఆమె కష్టపడితే పడ్డారు కానీ దేశాన్ని పాలించిన ఆ పెద్దాయనని కూడా రోడ్డుమీద నిలబెట్టించి ఆయనతో కూడా నినాదాలు చేయించారే అయ్యో పాపం...అని మళ్ళీ గిట్టని వాళ్ళు బుగ్గలు నొక్కుకొన్నారు. కానీ కన్న ప్రేమ ముందు అవ్వన్నీ లెక్కలోకి రావు. అందుకే ఇవాళ్ళ ఆమె కూడా లోక్ సభలో స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిలబడి అందరితో కలిసి నినాదాలు చేసారు. అది చూసి కడుపు తీపి ఎంతకయినా తెగించేలా చేస్తుందని జనాలు అనుకొన్నారే తప్ప ఆమె దేశం కోసం ఏదో పోరాడేస్తున్నారనుకోవడం లేదు. ఇంకెంత మరొక్క రోజు ఓపిక పడితే పార్లమెంటు సమావేశాలు ముగిసిపోతాయి ఆనక మళ్ళీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు రెస్ట్ తీసుకోవచ్చును. అందుకే ఆమెతో సహా అందరూ కలిసి రాహుల్ బాబు కోసం అంత కష్టపడుతున్నాట్లున్నారు.