అమలాపురంలో వెయ్యి అడుగులు భారీ పిడకల దండ

 

తెలుగువారు మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి ఉత్సవాల్లో  మొదటి రోజు నిర్వహించే భోగి ప్రత్యేకమనే చెప్పుకోవాలి. తెల్లవారుజామునే అభ్యంగ స్నానమాచరించి.. ఆవు పేడతో చేసే పిడకలను భోగి మంటల్లో వేస్తారు. ఇంట్లోని పాత, ఉపయోగంలో లేని వస్తువులను భోగి మంటల్లో వేస్తే శుభం కలుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. ఇదిలా ఉండగా.. భోగి పండుగను పురస్కరించుకుని అంబేడ్కర్ కోనసీమలో రూపొందించిన భారీ భోగి దండ అందరినీ ఆకట్టుకుంటోంది. 

అమలాపురంలోని రంగాపురం గ్రామస్థులు ఈ భోగి మాలతో సంక్రాంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దాదాపు 20 వేల పిడకలతో 1000 అడుగుల భారీ భోగి దండను తయారు చేశారు గ్రామస్థులు. ఆ ఊళ్లోని విశ్వనాథ రాజు కుటుంబం.. స్థానికులతో కలిసి ఆవు పేడతో 20 రోజుల పాటు శ్రమించి ఈ హారాన్ని తయారు చేసింది. తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసేందుకు గత ఆరేళ్లుగా భారీ భోగి దండలను గ్రామస్థులు తయారు చేస్తున్నారు. ఆరేళ్ల క్రితం 400 అడుగులతో మొదలైన భోగి దండ తయారీ నేడు 1000 అడుగులకు చేరిందని ఆ ఊరి ప్రజలు వివరించారు. 

సుమారు అర కిలోమీటర్ మేర ఉన్న ఈ భారీ భోగి మాలను గ్రామస్థులతో కలిసి విశ్వనాథరాజు కుటుంబ సభ్యులు భోగి మంటలో వేశారు.  ప్రస్తుతం ఈ భారీ భోగి దండ జిలాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు.. కాకినాడ జిల్లా పిఠాపురం జై గణేశ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో 14 వేల ఆవు పిడకలతో భోగిమంట వేశారు. ఆలయం నుంచి మేళ తాళాలు, తప్పెడు గూళ్లు, గంగిరెద్దులు, హరిదాసుల సంకీర్తనలతో కోటగుమ్మం సెంటర్ వద్ద భోగి మంట వేశారు. ఆలయ అర్చకులు మైలవరపు రామకృష్ణ భోగి మంట వద్ద ప్రత్యేక పూజలు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu