జి.హెచ్.యం.సి. పరిధిలో 27,12,468 ఓట్లు రద్దు?
posted on Sep 20, 2015 7:51AM
.jpg)
పెరిగిన జనాభాకి అనుగుణంగా వార్డుల పునర్విభజన చేయడం కోసమే జి.హెచ్.యం.సి. ఎన్నికలు వాయిదా వేశామని తెలంగాణా ప్రభుత్వం పదేపదే చెపుతోంది. కానీ అది చేస్తున్న పని మాత్రం జి.హెచ్.యం.సి. పరిధిలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించడం. అది ఎందుకో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హైదరాబాద్ లో ఆంధ్రా ప్రజలు ఎక్కువగా స్థిరపడిన కూకట్ పల్లి సర్కిల్ లోనే ఏకంగా 1,21,085ఓట్లను తొలగించారు. ఆ తరువాత ఖైరతాబాద్, ఉప్పల్ సర్కిల్స్ లో అత్యధికంగా ఓట్లను తొలగించారు.
తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిరసనలు చేపట్టి దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పిర్యాదు చేసాయి. తెలంగాణా ప్రభుత్వం సుమారు 17 లక్షల ఓట్లు తొలగిస్తోందని అవి పిర్యాదు చేసాయి. కానీ మొత్తం 27,12,468 ఓట్లను రద్దు చేయడానికి ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు సమాచారం. ఎన్నికల జాబితాలో రెండు చోట్ల పేరున్నవారు, అధికారులు వచ్చినప్పుడు ఇంటికి తాళాలు వేసున్నవారివి, చిరునామా మారినవారివి తదితర కారణాలతో ఓట్లను తొలగిస్తున్నారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల మేరకే అనర్హులుగా భావించినవారి పేర్లను తొలగిస్తున్నామని జి.హెచ్.యం.సి. కమీషనర్ సోమశేఖర్ అన్నారు. అర్హులయినవారు స్థానికంగా ఉంటున్నట్లు ఆధారాలు చూపిస్తే మళ్ళీ వారి పేర్లను జాబితాలో చేర్చుతామని చెప్పారు.
ఓటరు కార్డులను ఆధార్ కార్డులతో లింక్ చేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. కనుక తక్షణమే ఆధార్-ఓటర్ కార్డుల లింక్ ప్రక్రియను నిలిపి వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ జి.హెచ్.యం.సి. పరిధిలో మాత్రం స్థానికంగా ఉంటున్నట్లు ఆధారాలు చూపించలేకపోతే ఓటర్ల జాబితాలో నుండి పేర్లను తొలగిస్తున్నామని జి.హెచ్.యం.సి. కమీషనర్ సోమశేఖర్ చెప్పడం విశేషం. బోగస్ ఓటర్లను ఏరివేయడం అత్యవసరమే. కానీ ఆ పేరుతో జి.హెచ్.యం.సి. పరిధిలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్ల పేర్లను తొలగించడం అన్యాయమని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. కానీ తెలంగాణా ప్రభుత్వం ఈ వ్యవహారంలో వెనకడుగువేసే ఆలోచనలో లేదు. చివరికి ఈ వ్యవహారం కూడా హైకోర్టుకో సుప్రీం కోర్టుకో చేరుతుందేమో.