ఇసుక తుఫాన్... టీడీపీని ముంచేస్తుందా?

ఉల్లి దెబ్బకు ప్రభుత్వాలే తారుమారైనట్లుగా, ఇసుక దెబ్బకు ఏపీలో టీడీపీ చావుదెబ్బ తినే పరిస్థితులు చాపకింద నీరులా సాగుతున్నాయి. నిన్నమొన్నటివరకూ మూడు నాలుగు వేలకే దొరికే లారీ ఇసుక, కొత్త విధానంతో పది నుంచి 20వేల రూపాయలు పలుకుతుండటంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఐరన్, సిమెంట్ లాగే ఇసుక ధరలు కూడా అమాంతం పెరిగిపోవడంతో పేదవాడికి సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. అయితే ఉచితంగా దొరికే ఇసుకను కూడా సామాన్యులకు అందని ద్రాక్షగా మార్చేయడంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది.


అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇసుకను కూడా ప్రభుత్వం ఆదాయ వనరుగా చూడటంతో ఓ పాలసీని తీసుకొచ్చింది. ఇసుక ర్యాంపులను డ్వాక్రా మహిళలకు కేటాయించి వాళ్లు పైకి రావాలని ఆకాంక్షించింది. అయితే ఇసుక వ్యాపారంలో లాభాలను రుచి మరిగిన పొలిటికల్ లీడర్స్...డ్వాక్రా సంఘాల పేరుతో కబ్జా చేసుకుని మాఫియాగా ఏర్పడ్డారు.  దాంతో వాళ్లాడిందే ఆట, పాడిందే పాటగా తయారైంది. ఇష్టమొచ్చినట్లు ఇసుకను అక్రమంగా తవ్వేస్తూ అతి తక్కువ టైమ్ లో కోట్లు గడిస్తున్నారు. సాయంత్రం వరకే ఇసుక తవ్వాల్సి ఉండగా, రాత్రీపగలనే తేడా లేకుండా ఇసుకను తోడేస్తున్నారు. పట్టిసీమ పేరుతో కూడా ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేశారని చెబుతున్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇసుక మాఫియా ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. ఓ పత్రిక కథనం ప్రకారం ఏపీలో నలుగురు మంత్రులు, 38మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఇసుక మాఫియాలో భాగస్వామ్యులుగా ఉన్నారని, కిందిస్థాయి నేతలైతే వేలల్లో ఉంటారని తెలిపింది. ఉభయగోదావరి జిల్లాల్లో అయితే టీడీపీ, వైసీపీ నేతలు కలిసి ఇసుక వ్యాపారం చేస్తున్నారని రాసుకొచ్చింది. ఒక్కో ఎమ్మెల్యే నెలకు మూడు కోట్లు సంపాదిస్తున్నారని, ఏడాదికి సగటున 30కోట్లు వెనకేస్తున్నారని లెక్కగట్టారు. ఇప్పటివరకూ 2వేలకోట్ల రూపాయలకు పైగా దోచేశారని, ఇది ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంచనా వేసింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇసుక మాఫియాను అరికట్టలేకపోతున్నామని వ్యాఖ్యానించారంటే... ఏ రేంజ్ లో వాళ్ల నెట్ వర్క్ ఉందో అర్థమవుతుంది. మరి సామాన్యులకు అందుబాటు ధరలో ఉండాల్సిన ఇసుక అందకుండా పోతే, 2019 ఎన్నికల్లో టీడీపీ ఇసుకు తుఫానులో కొట్టుకోవడం ఖాయమని, చంద్రబాబు ఇప్పటికైనా మేల్కొని ప్రజలకు మేలైన విధానం తీసుకురావల్సిన అవసరముందని అంటున్నారు. లేదంటే ఉల్లి దెబ్బలాగా, ఇసుక తుఫాన్ తప్పదేమో.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu