జగన్ పై సమరానికి ఇదే సమయం అంటున్న నిరుద్యోగులు
posted on Feb 2, 2022 11:45AM
ఓ వైపు డీఎస్సీ ఆలస్యంతో నిరుద్యోగులు ఆగ్రహంతో రగిలిపోతుంటే.. మరో వైపు ఉపాధ్యాయ పోస్టులకు జగన్ సర్కార్ వయో పరిమితి తగ్గించడంపై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కర్నూలులో ఉపాధ్యాయులు ఆగ్రహంతో ఆందోళనలకు దిగుతుంటే.. ఇంకో వైపు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచి, నిరుద్యోగ డీఎస్సీ అభ్యర్థుల వయో పరిమితిని 42 ఏళ్లకే పరిమితం చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
డీఎస్సీ-2018 వరకు ఉపాధ్యాయ పోస్టుల వయో పరిమితి 44 ఏళ్లు ఉండగా... వైయస్ జగన్ ప్రభుత్వం వచ్చాక.. వివిధ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, బ్యాక్ లాగ్ ఉపాధ్యాయ పోస్టుల వయో పరిమితిని 42 ఏళ్లకే కుదించింది. అంటే రెండేళ్ల వయోపరిమితికి అడ్డంగా కోత విధించిందీ జగన్ సర్కార్. 42 ఏళ్ల వయోపరిమితి ఆధారంగా ఇటీవల వరకు మోడల్ స్కూళ్లు, సాంఘిక సంక్షేమ శాఖలో చాలా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, బ్యాక్ లాగ్ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఈ ప్రభుత్వం నిర్వహించింది. రాబోయే డీఎస్సీకి ఇదే వయో పరిమితి ఉంటుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్త డీఎస్సీ ఇవ్వకపోగా... ఉన్న వయోపరిమితిలో కాంట్రాక్టు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో రెండేళ్లు కోత విధించడాన్ని బీఈడీ, డీఎడ్, భాషా పండిట్లు తీవ్రంగా తప్పు పడుతున్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగులకు రెండేళ్లపాటు పదవీ విరమణ వయస్సు పెంచి, ఇటు నిరుద్యోగులకు రెండేళ్లు వయోపరిమితి తగ్గించడంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై వారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు రెండేళ్లకు పెంచారు. దీంతో రాష్ట్రంలో ఉపాధ్యాయ నూతన పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి ఏడాది డీఎస్సీ ఇస్తామంటూ ప్రతిపక్ష నేతగా నాడు వైయస్ జగన్.. తన పాదయాత్రలో ప్రకటించడమే కాకుండా.. వైయస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పెట్టారని వారు గుర్తు చేస్తున్నారు. అయితే ఆ హామీ ఇంతవరకు అమలుకు నోచుకోకపోవడంపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండున్నరేళ్లుగా ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించకపోవడంతో సదరు అభ్యర్థులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రకటించిన డీఎస్సీలో మిగిలిపోయిన, పాత డీఎస్సీల కోర్టు కేసులతో మిళితమైన పోస్టులనే జగన్ ప్రభుత్వం భర్తీ చేసి చేతులు దులుపుకుందని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 25 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని నిరుద్యోగులు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుకుంటూ పోతే తమ పరిస్థితేమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మే నుంచి జులై మాసాల మధ్య వేలాదిమంది జిల్లాల వారీగా ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నారని.. ఈ నేపథ్యంలో ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు అదనంగా ఈ పోస్టులు వచ్చి చేరతాయని వారు చెబుతున్నారు.
జగన్ అధికారంలోకి వచ్చాక కనీసం టెట్ పరీక్ష కూడా నిర్వహించ లేక పోయారని.. అలాగే డీఎస్సీ-2018 తర్వాత ఇప్పటివరకూ కొత్త డీఎస్సీ ప్రకటన లేదని.. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ అభ్యర్థుల వయోపరిమితికి ఎలాంటి నష్టం కలగకుండా డీఎస్సీ వయో పరిమితి 47 ఏళ్లకు(జనరల్) పెంచాల్సిన అవసరముందని వారు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం పేరిట సీబీఎస్ఈ విధానాన్ని అమలులోకి తేవడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదేళ్ల నుంచి ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో తెలుగు భాషా పండిట్ల పోస్టులు అరకొరగానే ఉంటున్నాయని.. ప్రైవేట్ విద్యాసంస్థల్లో తెలుగు ఫస్టు లాంగ్వేజ్ తీసుకునే వారి సంఖ్య బాగా తగ్గిపోయి... వాటి స్థానంలో హిందీ, సంస్కృతం ఆప్షన్లు అందుబాటులో ఉంచుతున్నారని నిరుద్యోగ అభ్యర్థులు పేర్కొంటున్నారు. నూటికి నూరుశాతం తెలుగు సబ్జెక్టును ఎవరూ తీసుకోవడం లేదని... ఇదే విధానం ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే అవకాశముందని... ప్రభుత్వం తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ, అన్ని ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు భాషా పండిట్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు.