కుటుంబ వ్యాపారాలకు జగన్ గార్డియన్ మాత్రమే.. షర్మిల స్పష్టీకరణ
posted on Oct 25, 2024 2:52PM
.webp)
వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య ఆస్తి తగాదాలు రోడ్డున పడి చాలాకాలమే అయ్యింది. ఇప్పుడు జగన్ షర్మిలకు ఇచ్చిన షేర్లను కాల్ బ్యాక్ చేస్తానంటూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ను ఆశ్రయించడంతో అన్నా చెళ్లెళ్ల తగాదా ముదిరి పాకాన పడినట్లైంది. ప్రతి కుటుంబంలోనూ ఇటువంటి గొడవలు సహజమే అంటే దీనిని జగన్ తేలిగ్గా కొట్టేయడానికి చేసిన ప్రయత్నం షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ తో విఫలమైంది.
తల్లీ, చెల్లిని కోర్టుకు లాగిన అన్న ఎవరైనా ఉంటారా అంటూ ఆమె ఎలాంటి శషబిషలూ లేకుండా జగన్ ను నిలదీసింది. ఈ నేపథ్యంలోనే ఆమె వైఎస్ఆర్ అభిమానులకు ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో తన సోదరుడి తీరును గట్టిగా ఎండగట్టడమే కాకుండా సంచలన విషయాలు వెల్లడించారు. జగన్ మీడియా, సోషల్ మీడియాలో జగన్ కు అనుకూలంగా ఇష్టారీతిగా వార్తలు వండి వారుస్తున్నారనీ, అందుకే వైఎస్ అభిమానులకు వాస్తవాలు తెలియజేయడం తన బాధ్యతగా భావించి ఈ లేఖ రాస్తున్నానంటూ ఆమె పేర్కొన్నారు. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది.
వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉండగా స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాలలోనే ఆయన మనవలు నలుగురికీ సమాన వాటా ఉండాలని చెప్పారు. ఆ విషయం తమ కుటుంబ సభ్యులకే కాకుండా కేవీపీ, వైవీసుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి వంటి కుటుంబ సన్నిహితులకు కూడా తెలుసు అని షర్మిల ఆ లేఖలో పేర్కొన్నారు. అంతే కాకుండా అన్ని కుటుంబ వ్యాపారాలకూ జగన్ ఒక గార్డియన్ మాత్రమేనని స్పష్టం చేశారు. తండ్రి అభీష్టాన్ని నెరవేర్చడం కుమారుడిగా జగన్ బాధ్యత. కానీ ఆయన ఆ బాధ్యత విస్మరించారని షర్మిల ఆలేఖలో పేర్కొన్నారు.
.webp)