ఫామ్ తాత్కాలికం.. కోహ్లీ టాలెంట్, టెక్నిక్ శాశ్వతం!
posted on Dec 4, 2025 10:24AM
.webp)
విరాట్ కోహ్లీ.. క్రీడలతో సంబంధం ఉన్నవారికీ, లేని వారికీ, అసలామాటకొస్తే అందరికీ చిరపరిచితమైన పేరు. దశాబ్దాలుగా భారత క్రికెట్ వెన్నెముకగా నిలుస్తూ వస్తున్న విరాట్ కోహ్లీ పరుగుల దాహం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫార్మాట్ ఏదైనా భారత క్రికెట్ అంటే కోహ్లీ, కోహ్లీ అంటే ఇండియన్ క్రికెట్ అన్నంతగా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నాడు కింగ్ విరాట్ కోహ్లీ. అలాంటి విరాట్ కోహ్లీపై ఇటీవల కొంత కాలంగా ఫామ్ కోల్పోయాడు, ఇక ఆటకు గుడ్ బై చేప్పేయడమే బెటర్ అంటూ కొందరు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. అయితే ఆ విమర్శలకు, విమర్శకులకూ కోహ్లీ నోటితో కాకుండా బ్యాట్ తో సమాధానం చెప్పారు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లలోనూ అద్భుత సెంచరీలు సాధించి తనలో ఆట ఇంకా మిగిలే ఉందని చాటాడు. తొలి వన్డేలో 135 పరుగులతో చెలరేగిన కోహ్లీ, బుధవారం (డిసెంబర్ 30 జరిగిన రెండో వన్డేలో కూడా శతకబాదాడు. ఈ రెండు మ్యాచ్ లలో విరాట్ బ్యాటింగ్ చూసిన వారంతా కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వింటేజ్ కోహ్లీని చూస్తున్నామని అంటున్నారు. అండర్ 19 వరల్డ్ కప్ లో భారత జట్టు కెప్టెన్ గా నాడు కోహ్లీలో కనిపించిన ఫైర్ మళ్లీ కనిపిస్తోందనీ, అలాగే బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగితే సెంచరీ చేయకుండా తిరిగి రాకూడదన్న పట్టుదల కోహ్లీలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందంటున్నారు. కోహ్లీ లేని క్రికెట్ అంటే శూన్యం అంటున్నారు.
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ వన్డేలలో ఇప్పటి వరకూ 53 సెంచరీలు చేశాడు. 35 ఏళ్ల కోహ్లీ ఇప్పటికీ యాక్యురెసీ, యగ్రసివ్ నెస్, ఫిట్ నెస్ విషయంలో కొత్త వారికి ఒక మోడల్ గా నిలుస్తున్నాడనడంలో సందేహం లేదు. టన్నుల కొద్దీ పరుగులు చేసిన కోహ్లీ ఇప్పటికీ సింగిల్ రన్ కోసం వికెట్ల మధ్య చిరుతను మించిన వేగంతో పరుగెత్తుతాడు. ఆ ఫిట్ నెస్ కొత్త కుర్రాళ్లలో కూడా కనిపించదని మాజీ క్రికెటర్లు అంటున్నారు.