హిడ్మాది ఎన్ కౌంటర్ కాదు ముమ్మాటికీ హత్యే.. మావోయిస్టుల లేఖ
posted on Dec 4, 2025 11:59AM

మావోయిస్టు కీలక నేత హిడ్మా ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. హిడ్మాది ఎన్ కౌంటర్ కాదనీ, అది ముమ్మాటికీ పోలీసులు చేసిన హత్యేనని సంచలన ఆరోపణ చేసింది ఈ మేరకు వికల్ప్ పేరుతో విడుదల చేసిన లేఖలో హిడ్మాను విజయవాడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి ఆ తరువాత హత్య చేశారని ఆరోపించింది. అనారోగ్యంతో చికిత్స కోసం నవంబర్ 15న విజయవాడ వచ్చిన హిడ్మాను అదే రోజు పోలీసులు అదుపులోనికి తీసుకుని.. మూడు రోజుల తరువాత అంటే నవంబర్ 18న అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశారని ఆ లేఖలో మావోయిస్టు పార్టీ ఆరోపించింది.
హిడ్మా కదలికల సమాచారాన్ని లొంగిపోయిన మావోయిస్టు కుసాల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడని కమిటీ ఆరోపించింది. ఈ కుట్రలో విజయవాడకు చెందిన కొందరు వ్యాపారులు, కాంట్రాక్టర్ల పాత్ర కూడా ఉందని పేర్కొంది. హిడ్మా హత్యకు మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ కారణమంటూ వస్తున్న ఆరోపణలను మావోయిస్టు పార్టీ దండకారణ్య జోనల్ కమిటీ ఖండించింది. మావోయిస్టు పార్టీపై జరుగుతున్న కుట్రలో భాగమే ఆ ఆరోపణలు అని పేర్కొంది. ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని,హడ్మా హత్య సహా ఎన్ కౌంటర్ లపై న్యాయ విచారణ జరిపించాలని మావోయిస్టు పార్టీ ఆ లేఖలో డిమాండ్ చేసింది.