బీఆర్ఎస్ అధినేతలో విజయంపై బెరుకు? ఎందుకంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, గత తొమ్మిదేళ్ళలో ఎప్పుడూ లేని విధంగా, ఇప్పుడు కష్ట కాలాన్ని ఎదుర్కుంటున్నారు. ఆయన ఏదో అనుకుంటే, ఇంకేదో జరుగుతోంది? ఒకదాని వెంట ఒకటిగా సమస్యలు ఆయన్ని చుట్టుముడుతుయి.   తెలంగాణలో  క్షేత్ర స్థాయిలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే, ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ బీఆర్ఎస్’ అనే సంకేతాలే విస్పష్టంగా కనిపిస్తున్నాయి.

నిజానికి, 2014 తర్వాత చిన్న చిన్న ఎదురుదెబ్బలు తగిలినా  తెలంగాణ రాష్ట్ర సమితి,(తెరాస) అదే పేరుతో ఉన్నంత వరకు కేసీఆర్ నాయకత్వానికి ఎదురన్నదే లేదు. ఆయన భయపడిన సందర్భం కూడా లేదు. కానీ ఇప్పడు ముఖ్యమంత్రి కేసీఆర్ లో బెరుకుదనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. బీజేపీ పేరు ఎత్తి విమర్శ చేయడానికే ఆయన సాహసించడం లేదు.  

 మంచైనా చెడైనా టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) మన పార్టీ, మన తెలంగాణ పార్టీ, కేసీఆర్ మన నాయకుడు అని నమ్మి తొమ్మిదేళ్ళుగా కేసీఆర్ కు అండగా నిలిచిన తెలంగాణ వాదులు, పార్టీ క్యాడర్, అభిమానుల ఆలోచనలలో వస్తున్న పార్టీ పేరు మార్పు తరువాత ‘మార్పు’ ప్రస్ఫుటంగా కనిపించడమే ఇందుకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నరు. కారణాలు ఏవైనా, ఎన్నికల సంవత్సరంలో పార్టీ పరిస్థితి ఒకింత ఇబ్బందికరంగానే ఉందని అంటున్నారు.

వంద సీట్లకు పైగా గెలుస్తామన్న ఒకప్పటి ధీమా ఇప్పుదు పార్టీ అధినేత కేసీఆర్ లో, పార్టీ నేతల్లో, శ్రేణుల్లో కాగడా పెట్టి వెతికినా కానరావడం లేదని అంటున్నారు. ముఖ్యంగా వామపక్షాలు చెయ్యేస్తేనే గానీ, మునుగోడు గెలవలేని పరిస్థితి నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లో ఎన్నికల భయం కనిపిస్తోందని అంటున్నారు.అలాగే, రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా లేవన్న  వాస్తవాన్ని ముఖ్యమంత్రి గ్రహించారు.  

అందుకే  పార్టీ పేరు బీఆర్ఎస్ అయినా.. ఆయన జాతీయ రాజకీయాలలో పెద్దగా జోక్యం చేసుకుంటున్న దాఖలాలు కనిపించకుండా ఇటీవలి కాలంలో కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారు. గతంలో సందర్భం ఉన్నా లేకున్నా.. బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించే కేసీఆర్ ఇప్పుడు అవకాశం ఉన్నా, సందర్భం వచ్చినా బీజేపీని కానీ, మోడీని కానీ పల్లెత్తు మాట అనడం లేదు. ఈ పరిస్థితే రాష్ట్రంలో బీఆర్ఎస్ కు కష్ట కాలం నడుస్తోందని తేటతెల్లం చేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.