తెలంగాణలో కాంగి‘రేసు’

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, హిమాచల్ ఎన్నికలలో విజయం.. ఆ తరువాత కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో తిరుగులేని గెలుపు.. కాంగ్రెస్ పార్టీలో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని జోష్ ను పెంచాయి. పార్టీలో గతంలో ఎన్నడూ కానరాని ఐక్యత కనిపిస్తోంది. ఈ ఏడాదిలో పలు రాష్ట్రాలలో  అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ముందస్తు వ్యూహాలతో దూసుకుపోతున్నది. మరో వైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కర్నాటక పరాజయంతో దిగాలు పడితే.. అదే సమయంలో కాంగ్రెస్ లో నయా జోష్ కనిపిస్తోంది.

ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో కనీవినీ ఎరుగని సమన్వయం ద్యోతకమౌతోంది. ఎన్నికలకు మరో ఆరు నెలల వరకూ సమయం ఉండగానే ఎన్నికల టీమ్ ను తెలంగాణ కాంగ్రెస్ రెడీ చేస్తున్నది. ఇంత కాలం అంతర్గత కలహాలతో నీరసించిన తెలంగాణ కాంగ్రెస్ కు కర్నాటకలో తమ పార్టీ విజయం జీవన్ టోన్ టానిక్ గా మారింది. అధిష్ఠానం ఆదేశాల మేరకు ఎటువంటి సమస్యలూ రాకుండా కాంగ్రెస్ ఎలక్షన్ టీమ్ ను రెడీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా అన్ని సామాజిక వర్గాలకూ ప్రాధాన్యత ఇస్తూనే, సీనియారిటీని కూడా పరిగణనలోనికి తీసుకుని సీసీపీ కార్యకవర్గ ఏర్పాటుకు సమాయత్తమౌతోంది. ఆ దిశగా ఇప్పటికే విస్తృత చర్చలు పురోగతిలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

హస్తిన డైరెక్షన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కసరత్తులో అందరి భాగస్వాములను చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పార్టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ పార్టీలో అసమ్మతి మొలకెత్తకుండా తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు.  అన్నిటికీ మించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ కీలక నేతలు రాహుల్, గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారన్న సమాచారం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.  

 ఈ  ఏడాది చివర్లో జరిగే తెలంగాణ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చూపి, 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా ఇప్పటి నుంచే కాంగ్రెస్ హై కమాండ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ప్రతి రాష్ట్రంపైనా కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక దృష్టిని సారిస్తోంది. అందులో భాగంగానే   తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇచ్చి కూడా ఆ క్రెడిట్ ను ఖాతాలో వేసుకోవడంలో వైఫల్యాన్ని అధిగమించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతోంది.

అందుకే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలను స్వయంగా ప్రియాంక గాంధీ తీసుకున్నారని చెబుతున్నారు. అంతే కాకుండా అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ విజయం సాధిస్తే.. ప్రియాక గాంధీ స్వయంగా రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి లోక్ సభ బరిలో దిగుతారని కూడా ఇప్పటికే పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చింది.  గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణపై కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి పెట్టడం, అన్నిటికీ మించి ప్రియాంక ప్రత్యేకంగా తెలంగాణ కాంగ్రెస్ ఎఫైర్స్ పై ప్రత్యక్ష పర్యవేక్షణకు అంగీకరించడంతో కాంగ్రెస్ విజయంపై అంచనాలు పెరిగాయి.