పిల్లలు తండ్రి నుంచి మాత్రమే నేర్చుకోగల 5 విషయాలు ఇవి..!

 

 

ప్రతి పిల్లవాడి దృష్టిలో తన తండ్రి సూపర్ హీరో.  బయట ఏ మహిళను అయినా అమ్మ అని పిలిచే వీలుంటుంది. కానీ నాన్న అని కేవలం కన్న తండ్రిని మాత్రమే పిలుస్తాం.  తల్లిదండ్రులలో ఎప్పుడూ పిల్లలకు దగ్గరగా ఉండేది,  పిల్లల బాగోగులు దగ్గరగా చూసుకునేది తల్లే. అందుకే చాలా మంది పిల్లలు తల్లితోనే చనువుగా ఉంటారు. కానీ తండ్రి బయట ఉద్యోగం చేసి భార్యా పిల్లలకు జీవితం మీద భరోసా ఇవ్వగలిగితేనే ఏ భార్య అయినా తన పిల్లలను ప్రశాంతంగా చూసుకోగలదు.  కాబట్టి ప్రతి కుటుంబం ప్రశాంతంగా ఉండటం వెనుక నాన్న కష్టం, ఆయన త్యాగం చాలా ఉంటుంది.  అయితే పిల్లలు తన తండ్రి నుండి మాత్రమే నేర్చుకోగలిగే విషయాలు కొన్ని ఉన్నాయి.  ఇవి బయట ఎవ్వరినీ చూసి నేర్చుకోలేరు.  అవేంటో ఓ లుక్కేస్తే..


బాధ్యత నుండి పారిపోకుండా ఉండటం..


చాలామంది కష్టం, బాధ,  అసౌకర్యం అనిపించగానే వాటి నుండి దూరంగా పారిపోతారు.  దానివల్ల తాము ప్రశాంతంగా ఉండగలుగుతాం అని అనుకుంటారు. కానీ తండ్రి అలా ఆలోచిస్తే భార్యాపిల్లల జీవితం తలకిందులు అవుతుంది.  తండ్రి బాధ్యతలు, కష్టాలను ఎదుర్కోవడానికి ఎప్పుడూ ఒక సైనికుడిలా సిద్దంగానే ఉంటాడు. కాబట్టే భార్యా పిల్లలు ఇంట్లో హాయిగా ఉండగలుగుతారు. బాధ్యతల నుండి పారిపోకుండా.. వాటిని  సమర్థవంతంగా మోసేది తండ్రి మాత్రమే.  ఈ లక్షణాన్ని పిల్లలు తండ్రి నుండి నేర్చుకుంటారు.  ఓ కుటుంబాన్ని మోయడం  బరువు కాదు బాధ్యత అని తండ్రి నుండి తెలుసుకుంటారు.


మాట వినడం..


చాలామంది అంటూ ఉంటారు.  అమ్మ చెబుతూ ఉంటే నాన్న వింటూ ఉంటాడు అని.  కొందరు ఈ విషయంలో తండ్రులను చులకన చేయడం, జోకులు వేయడం కూడా చేస్తారు.  అయితే తండ్రి ఇలా కేవలం వినడం వల్ల తల్లిదండ్రుల మద్య రెలేషన్ ఎంత ఆరోగ్యకరంగా ఉందో అర్థమవుతుంది. కొన్నిసార్లు తండ్రి చెప్పే మాటను తల్లి, తల్లి చెప్పే మాటలను తండ్రి ఓపికగా వినడం చూసి  పిల్లలు కూడా వినడాన్ని అలవాటు చేసుకుంటారు.   ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు వినడం అనే లక్షణం పిల్లలను కూడా గొప్పగా తయారుచేస్తుంది.


రోల్ మోడల్..

చాలామంది తల్లిదండ్రులను, తమ అవ్వ తాతలను తమ రోల్ మోడల్స్  అని పేర్కొంటూ ఉంటారు. నిజానికి ప్రతి పిల్లవాడికి తన తండ్రి రోల్ మోడల్ గా ఉండాలి. తండ్రి కుటుంబం బాధ్యత తీసుకుంటాడు. ఎవరికి ఏం కావాలన్నా చూసుకుంటాడు.  ఎవరికీ ఏ లోటు రాకుండా జాగ్రత్త పడతాడు. ఆర్ఠిక విషయాల నుండి సాధారణ సమస్యల వరకు ప్రతి దాన్ని తండ్రి ఎంతో  ఓపికగా డీల్ చేస్తాడు. అన్నింటినీ హ్యాండిల్ చేస్తాడు కాబట్టే తండ్రి కొడుకు దృష్టిలో రోల్ మోడల్ గా ఉంటాడు.


నిస్వార్థం..

ప్రతి తండ్రి తన పిల్లలు గొప్పగా ఉండాలని ఆశ పడతాడు.  చదువు చెప్పించడం నుండి,  పిల్లల  అవసరాలు తీర్చడం వరకు అన్ని విషయాలలో తనకంటే తన పిల్లలు ఎక్కువ సుఖపడాలని అనుకుంటాడు.  కొన్ని సార్లు పిల్లల సంతోషం కోసం డబ్బు కూడా లెక్క చేయడు. తనకు ఏమీ లేకపోయినా భార్య, పిల్లలను సంతోష పెడితే చాలని అనుకుంటాడు. కుటుంబం విషయంలో నిస్వార్థంగా ఉండేది నాన్న మాత్రమే. ఈ లక్షణాన్ని  పిల్లలు తండ్రి నుండే స్పష్టంగా గ్రహించి అలవాటు చేసుకోగలరు.

చేయడం, నేర్చుకోవడం..


ఒక మగాడు తన పిల్లల కోసం తనకు తెలియని పనిని కూడా చేయడానికి సిద్దపడతాడు. పనిని చేస్తూ నేర్చుకోవచ్చనే గుండె ధైర్యం,  ఆత్మవిశ్వాసం కేవలం తండ్రికి మాత్రమే ఉంటుంది. ఆ తండ్రి మనసులో కేవలం తన పిల్లలు, భార్యకు లోటు రాకూడదనే ఆరాటం తప్ప తను చేస్తున్నది ఎంత కష్టమైన పని అనే ఆలోచన అస్సలు ఉండదు. ప్రతి పిల్లవాడు తండ్రి నుండి ఈ లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. ఇది వారిని జీవితంలో ఏ పనిని అయినా ధైర్యంగా చేసేందుకు సహాయపడుతుంది.


                                       *రూపశ్రీ.


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu