టీఆర్ఎస్ సభలో ఈటల నినాదం.. గులాబీకి ఊహించని షాక్..
posted on May 29, 2021 4:14PM
కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.. ప్రతీకారం దిశగా అడుగులు వేస్తున్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ గా ముందుకు కదులుతున్నారు. రాజేందర్ కు కౌంటర్ గా అధికార పార్టీ ఎత్తులు వేస్తోంది. హుజురాబాద్ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ చేశారు కేసీఆర్. మండలానికో ఇంచార్జ్ ను నియమించారు. టీఆర్ఎస్ కేడరంతా పార్టీలోనే ఉండేలా , ఈటల రాజేందర్ కు మద్దతు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గులాబీ బాస్ వ్యూహానికి ఈటల నియోజకవర్గంలో చెక్ పడుతున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ డైరెక్షన్ లోనే సమావేశాలు నిర్వహిస్తున్న టీఆర్ఎస్ ముఖ్య నేతలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ కేడరంతా ఈటల అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాలు ఢీ అంటే ఢీ అనే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో పోటాపోటీగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక వర్గం నుంచి మరో వర్గంలోకి వలసలు కూడా ఎక్కువయ్యాయి. అధికార టీఆర్ఎస్ తన అంగ, అర్థ బలాలను వినియోగించి.. వలసలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. అటు ఈటల వర్గాన్ని, ఇటు బీజేపీ నేతలను టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకోవాలని ఆ పార్టీ నేతలు తహతహలాడుతున్నారు.ఈ నేపథ్యంలో వీణవంకలో టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ హాజరయ్యారు. ఈటల వైపు ఎవరూ వెళ్లొద్దని కార్యకర్తలకు లక్ష్మణ్ పిలుపు నిచ్చారు.
అయితే టీఆర్‌ఎస్ పార్టీ ఒకటి తలిస్తే అక్కడ మరొకటి జరిగింది. ఈ మీటింగ్‌లో ఈటల రాజేందర్‌కు అనుకూలంగా కొందరు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘జై’ ఈటల నినాదాలతో సభ దద్దరిల్లింది. దీంతో ఒక్కసారిగా టీఆర్‌ఎస్ నేతలు ఖంగుతిన్నారు. వెంటనే పోలీసులు కల్పించుకుని ఈటల మద్దతుదారులను సమావేశం నుంచి బయటకు పంపారు. ఈ ఘటనతో నియోజకవర్గంలో ఈటల రాజేందర్ కు బలం ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది.