నా ఓటమికి ఎన్నికల సంఘమే కారణం- కరుణానిధి

 

తమిళనాట కురువృద్ధుడు కరుణానిధి 92 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి పదివిని చేపట్టనున్నారంటూ ఘనంగా ప్రచారం జరిగింది. ఎగ్జిట్‌ పోల్స్ అన్నీ కూడా కరుణకు అనుకూలంగానే కనిపించాయి. కానీ ఇంతలో ఏమైందో ఏమోగానీ ఒకే ఒక్క శాతం తేడాతో కరుణ జీవిత చరమాంకంలో అమూల్యమైన అవకాశాన్ని కోల్పోయారు. గెలుపు ముంగిట బొక్కబోర్లా పడిపోయారు. విజయ్‌కాంత్‌ కనుక డీఎంకేతో జట్టుకట్టి ఉంటే ఫలితాలు మరోలా వచ్చి ఉండవచ్చు. కానీ తన ఓటమికి కారణం మాత్రం ఎన్నికల సంఘమే అంటున్నారు కరుణానిధి. తమిళనాట వందలకోట్ల రూపాయల డబ్బు విచ్చలవిడిగా ప్రవహిస్తున్నా, అధికార దుర్వినియోగం విశృంఖలంగా జరుగుతున్నా... ఎన్నికల అధికారులు చూసీచూడనట్లు ఉండిపోయారన్నది కరుణ ఆరోపణ. వీటికి తోడు వేలాదిగా పుట్టుకొచ్చిన బోగస్‌ ఓటర్‌ గుర్తింపు కార్డులను సైతం ఎన్నికల కమీషన్‌ పట్టించుకోలేదంటున్నారు. తాము లెక్కలేనన్ని సార్లు కమీషన్‌కు వినతులను అందించినా ప్రయోజనం లేకపోయిందనీ కరుణ వాపోతున్నారు. కానీ ఇప్పుడు ఎవరిని తిట్టుకుని మాత్రం ఏం ఉపయోగం. డీఎంకే అధికారంలోకి వచ్చే ఓ అమూల్యమైన అవకాశం చేజారిపోయింది. జయలలితతో పోల్చుకుంటే కరుణ కుమారుడు స్టాలిన్‌ ప్రజాదరణ అంతంత మాత్రమే కాబట్టి వచ్చే ఎన్నికలలో సైతం అమ్మకే పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. హతవిధీ!