ప్రభుత్వంలో పరిచయాలు ఉంటేనే పనులవుతాయి

 

మరో పది రోజుల్లో మన ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ఉన్న పెట్టుబడిదారులతో మాట్లాడి, వారిని మన దేశంలో పరిశ్రమలను స్థాపించేందుకు ఆహ్వానించనున్నారు. నిజానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఇప్పటికే మోదీ ప్రభుత్వం మంచి ప్రగతినే చూపించింది. గతంలో ఎన్నడూ లేనంతగా విదేశీ పెట్టుబడులు మన దేశంలోకి ప్రవహిస్తున్నాయి. చైనాని సైతం కాదని మన దేశంలో పారిశ్రామిక రంగంలో దూసుకెళ్తోంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మన దేశ వ్యవస్థ గురించి అమెరికాలోని నార్తకెరోలినా రాష్ట్ర గవర్నరు ఒక తీవ్ర వ్యాఖ్య చేయడం సంచలనంగా మారింది. ఇంతాచేసి సదరు గవర్నరు భారతీయ మూలాలు కలిగిన ‘నికీ హేలే’ కావడం ఆశ్చర్యం. ఇండియాలో ఎవరన్నా వ్యాపారం చేయాలనుకుంటే, వాళ్లకి ప్రభుత్వంలో పరిచయాలు ఉంటేనే పనులవుతాయనీ... ఈ పరిస్థితి పెట్టుబడిదారులను భయపెడుతోందనీ నికీ హేలే పేర్కొన్నారు. నికీ హేలే విషయాన్ని కాస్త ఘాటుగా చెప్పినా, మన దేశంలోని పరిస్థితులను అవి సరిగానే ప్రతిబింబిస్తున్నాయి. అందుకే సాక్షాత్తూ ప్రపంచ బ్యాంకు రూపొందించిన నివేదికలో మన దేశం ‘వ్యాపారానికి అనుకూలమైన దేశాల’ జాబితాలో 130వ స్థానంలో ఉంది. మరి పెట్టుబడిదారులను ఆహ్వానించడంలో ఉన్న శ్రద్ధ, వారి వ్యాపారం సజావుగా సాగడంలో కూడా ఉండాలి కదా! ఈ విషయంలో మోదీగారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.