ట్రెజర్ హంట్‌.. వ‌ర్షం ప‌డితే వ‌జ్రాలు.. ఆ నేల‌లో జాతిర‌త్నాలు..

రాయ‌ల‌సీమ ర‌త‌నాల సీమ మాత్ర‌మే కాదు.. వ‌జ్రాల నేల కూడా. అక్కడ వర్షాలు పడితే చాలు.. మట్టిలో వజ్రాలు పండుతాయి. చినుకు చినుకు పడే కొద్దీ మట్టి పొరల్లో దాగిన విలువైన వజ్రాలు బయట పడతాయి. 

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చిన్న జొన్నగిరి గ్రామంలో మే 27న ఓ రైతుకు విలువైన వజ్రం దొరికింది. ఏకంగా మూడు కోట్లు విలువ చేసే వజ్రం అత‌నికి ల‌భ్య‌మైంది. ఆ వజ్రాన్ని జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి కోటి ఇరవై లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే, బహిరంగ మార్కెట్‌లో ఈ వజ్రం విలువ సుమారు మూడు కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. 

తాజాగా.. పెరవలికి చెందిన మరో ఇద్దరికీ రెండు ఖరీదైన వజ్రాలు లభ్యమైనట్లుగా తెలుస్తోంది. బొప్పాయి తోటలో కలుపు తీస్తున్న మహిళా కూలీకి వజ్రం దొరికిందట‌. ఆ వజ్రాన్ని ఓ వ్యాపారి 70 వేలకు కొనుగోలు చేశాడ‌ని అంటున్నారు. అలాగే పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న మరో మహిళా కూలీకి వజ్రం దొర‌కగా.. ఓ వ్యాపారికి 40 వేలకు అమ్మినట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో వ‌జ్రాల‌ వేట సాగిస్తున్నారు.

కోట్లు విలువ చేసే వజ్రాల ను అక్కడి వ్యాపారస్తులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు ఇంత భారీ మొత్తంలో వజ్రాలు దొరికినా అక్కడి రెవెన్యూ అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని, ఆ దరిదాపులకి కూడా వెళ్లరనే విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యంత విలువైన వజ్రాలను వ్యాపారులు తక్కువ రేట్‌కు కొని ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఆ నేలే అలాంటిది. ఆ ప్రాంతం వ‌జ్రాల గ‌ని. వర్షాలు పడితే చాలు.. ఆ మ‌ట్టిలో వజ్రాలు పండుతాయి. చినుకు చినుకు పడే కొద్దీ మట్టి పొరల్లో దాగిన విలువైన వజ్రాలు.. వ‌ర్షం దాటికి పై పొరల నుండి బయట పడతాయి. అందుకే, అక్క‌డ వజ్రాలను వెతకటానికి వేరే ప్రాంతాల నుంచి కూడా పెద్దఎత్తున జనాలు అక్కడికి వస్తుంటారు. జొన్నగిరి ప్రాంత‌ చుట్టుపక్క గ్రామాల రైతులు వాళ్ల అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉదయం నుండి వజ్రాల వేట కొనసాగిస్తారు. దొరికిన వారు లక్షాధికారి.. దొర‌క‌ని వారి ప్ర‌య‌త్నం మ‌రోసారి...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu