సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదా? మధ్యలోనే ఆగిపోయాయా? మండలి ఛైర్మన్ సంచలన ప్రకటన

శాసన మండలిని రద్దు చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కౌన్సిల్ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని వికేంద్రీకరణ... సీఆర్డీఏ రద్దు బిల్లులు ఇంకా సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదంటూ క్లారిటీ ఇచ్చారు. మూడు రాజధానుల బిల్లు... అలాగే సీఆర్డీఏ రద్దు బిల్లు... మధ్యలోనే నిలిచిపోయాయని అన్నారు. ఈ రెండూ బిల్లులూ... సాంకేతిక కారణాలతో మండలిలోనే ఆగిపోయాయని... అవి ఎక్కడికీ వెళ్లలేదంటూ స్పష్టతనిచ్చారు. మొత్తం ప్రాసెస్‌ పూర్తయితేనే గానీ... బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లవని అన్నారు. అలాగే, తననెవరూ ప్రలోభపెట్టలేదని... ప్రభావితమూ చేయలేదని మండలి ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్ స్పష్టతనిచ్చారు.

కౌన్సిల్ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ మాటలనుబట్టి సాంకేతిక కారణాలతో రాజధాని వికేంద్రీకరణ... సీఆర్డీఏ రద్దు బిల్లులు మండలిలోనే ఆగిపోయినట్లు భావిస్తున్నారు. తన విచక్షణాధికారంతో సెలెక్ట్ కమిటీకి పంపాలని ఛైర్మన్‌ నిర్ణయం తీసుకున్నప్పటికీ... సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటుందని... అలాగే డివిజన్ నిర్వహించి.... చివరిగా ఓటింగ్ చేపట్టిన తర్వాతే.... మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు. కానీ, ఇవేమీ జరగకుండానే.... మండలి ఛైర్మన్ మధ్యలోనే వెళ్లిపోయినందున... ప్రాసెస్ నిలిచిపోయి... బిల్లులు కౌన్సిల్ లోనే ఆగిపోయాయని అంటున్నారు.

మొత్తానికి, రాజధాని వికేంద్రీకరణ... సీఆర్డీఏ రద్దు ల్లులు మండలిలోనే ఆగిపోయాయన్న కౌన్సిల్ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ప్రకటనతో వివాదం కొత్త మలుపు తిరిగినట్లయ్యింది. అయితే, బిల్లులు నిజంగానే మండలిలో ఆగిపోయాయా? లేక కౌన్సిల్ ఛైర్మన్ మాటలను అర్ధంచేసుకోవడంలో ఏమైనా పొరపాటు జరిగిందో తెలియాలంటే... మరింత క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏదిఏమైనా, మండలిని రద్దు చేస్తారంటూ ప్రచారం జరుగుతున్నవేళ మండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu