గవర్నర్ జోక్యం చేసుకోవాలి... జగన్ తీరుపై చంద్రబాబు నిప్పులు...

రాజధాని వివాదం, మండలి పరిణామాలపై తెలుగుదేశం నేతలు మరోసారి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఆధ్వర్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన టీడీపీ లీడర్లు... మండలిలో జరిగిన పరిణామాలను వివరించారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ ఆధారాలు అందజేశారు. మండలిలో మంత్రులు వ్యవహరించిన తీరును గవర్నర్ కు వివరించిన చంద్రబాబు.... ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జోక్యం చేసుకోవాలంటూ బిశ్వభూషణ్ కు విజ్ఞప్తి చేశారు.

వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ చంద్రబాబు మండిపడ్డారు. మంత్రులు... ఛైర్మన్ పోడియంను ముట్టడించి అనుచితంగా ప్రవర్తించారని, బూతులు తిట్టారని ఆరోపించారు. మండలి ఛైర్మన్‌కు విచక్షణాధికారాలు ఉంటాయనే సంగతి కూడా తెలియకుండా.... వైసీపీ లీడర్లు నీచ రాజకీయాలు చేస్తూ దాడులకు దిగుతున్నారంటూ మండిపడ్డారు. రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేకపోతే... మరీ మూడు రాజధానుల బిల్లు ఎందుకు పెట్టారంటూ సీఎం జగన్‌ను చంద్రబాబు ప్రశ్నించారు.

ఇక, మండలిని రద్దు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపైనా టీడీపీ నేతలు ఘాటుగా రియాక్టవుతున్నారు. ఒకవేళ కౌన్సిల్‌ రద్దుకు తీర్మానం చేసినా అది కార్యరూపం దాల్చడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని, అప్పటివరకు మండలి... అలాగే సెలెక్ట్‌ కమిటీ ఉనికిలోనే ఉంటాయని యనమల చెప్పుకొచ్చారు.