రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీని క్షమించండి!

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ నేటికీ రెండు నాల్కలతో మాట్లాడటం మానలేదు. తెలంగాణా సాధన కోసం ఎన్నో ఏళ్లుగా అనేక ఉద్యమాలు చేసినా తెలంగాణా ఏర్పడలేదని కానీ సోనియా గాంధీ దయతలచి తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసారని, అందుకు తెలంగాణా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సర్వదా రుణపడి ఉండాలని తెలంగాణా కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం అందరికీ తెలుసు. కానీ అదే కాంగ్రెస్ పార్టీకి నేతలు “రాష్ట్ర విభజన చేసినందుకు ఏ.ఐ.సి.సి. తరపున విచారం వ్యక్తం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు క్షమించాలని” కోరుతున్నారు. ఈ మాటలు అన్నది ఎవరో గల్లీ స్థాయి నేతలు కాదు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్-చార్జ్ మరియు ఏ.ఐ.సి.సి. కార్యదర్శి అయిన సూరజ్ హెగ్డే బుధవారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో యువజన కాంగ్రెస్ నిర్వహించిన యువ శంఖారావం సదస్సులో ఈ మాటలు అన్నారు. అంటే రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ అధిష్టానం నిజంగా పశ్చాతాపపడుతోందనుకోవాలా? లేక ప్రజాభిప్రాయాన్ని మన్నించకుండా రాష్ట్ర విభజన చేసినందున రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది కనుక మళ్ళీ రాష్ట్ర ప్రజలను ప్రసన్నం చేసుకోనేందుకే ఇటువంటి మాటాలు మాట్లాడుతోందనుకోవాలా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగా పశ్చాతాపపడితే అదే ముక్కని తెలంగాణా రాష్ట్రంలో కూడా అనే సాహాసం చేయగలదా?


ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం అనేక దశాబ్దాలుగా ఉద్యమాలు జరుగుతున్నా, వేలమంది యువకులు బలిదానాలు చేసుకొన్నా ఏనాడు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. కానీ సార్వత్రిక ఎన్నికలలో తన విజయావకాశాలు పెంచుకొని మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావాలనే ఆలోచనతోనే ఎన్నికలకు ముందు హడావుడిగా రాష్ట్ర విభజన చేసి చేతులు దులుపుకొన్న సంగతి అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన సమయంలో ఎంత దుర్మార్గంగా ఆలోచించిదంటే తను ఎన్నికలలో గెలిచేందుకు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలా లేక మూడు ముక్కలు చేయాలా ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలుగా విడదీస్తే తనకు లాభమా లేకపోతే ఆంధ్రా రాయల తెలంగాణా రాష్ట్రాలుగా విడదీస్తే తనకి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందా అని ఆలోచించిందే తప్ప ఆంద్ర, తెలంగాణా ప్రజల మనోభావాలను పట్టించుకోలేదు. అదే విధంగా తెలంగాణాలో తెరాసను విలీనం చేసేసుకొని తెలంగాణా రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఓట్లు సంపాదించుకోవాలని దురాశకు పోయింది. కానీ కాంగ్రెస్ ప్రదర్శించిన ఆ అతితెలివికి చివరికి అదే బలయిపోయింది. రెండు రాష్ట్రాలలోనే కాకుండా కేంద్రంలో కూడా అధికారంలోకి రాలేకపోయింది.

 

అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకొని తన తప్పులను సవరించుకోకపోగా నేటికీ ప్రజలను ఈవిధంగా మభ్యపెట్టి మళ్ళీ రాష్ట్రంలో తన పట్టు పెంచుకోవాలని ప్రయత్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్ర విభజన చేసినందుకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగా పశ్చాతాపపడి ఉండి ఉంటే, ఎన్నికల సమయంలోనే లెంపలు వేసుకొని అప్పుడే ఈ నాలుగు ముక్కలు చెప్పుకొని ఉండి ఉంటే బహుశః ఒకటో రెండో సీట్లయినా గెలుచుకోనేదేమో. కానీ అప్పుడు రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఏర్పాటు చేసిన ఖ్యాతి మొత్తం తనకే దక్కాలని తెలంగాణాలోచెప్పుకొంటూ,  ప్రాంతీయ పార్టీలు ఇచ్చిన లేఖలు, వాటి ఒత్తిళ్ళ కారణంగానే రాష్ట్ర విభజన చేయవలసి వచ్చిందని ఆంద్రప్రదేశ్ ప్రజలకు చెప్పుకొని ఓట్లు సంపాదించుకోవాలని ప్రయత్నించి భంగపడింది. ఇంత జరిగినా నేటికీ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి మార్పు, పశ్చాతాపం రాలేదని సూరజ్ హెగ్డే మాటలతో స్పష్టమయింది.

 

ఆంద్ర, తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని ఉద్యమాలు చేసినా, గత పదేళ్ళ అవినీతి, అసమర్ధ కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిపోయున్నరెండు రాష్ట్రాలలో ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారనే నమ్మకం లేదు. అలాగని కాంగ్రెస్ పార్టీ చేతులు ముడుచుకొని కూర్చొన్నట్లయితే రెండు రాష్ట్రాలలో పార్టీ పూర్తిగా అదృశ్యమయిపోవడం ఖాయం గనుక కాంగ్రెస్ నేతలు తమ పార్టీ ఉనికిని, తద్వారా తమ ఉనికిని కాపాడుకొనేందుకు ఇటువంటి మాటలేవో చెప్పుకోకతప్పదని ప్రజలు కూడా సరిపెట్టుకోవలసి ఉంటుంది.