రాహుల్ గాంధీ కోసమే కాంగ్రెస్ పార్టీ ఉందా?

 

రెండు నెలల పాటు విదేశాలలో సేద తీరి స్వదేశానికి తిరిగివచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ‘రాజు వెడలె రవి తేజములరియగా, కుడి ఎడమల్ డాల్ కత్తులు మెరియగా’ అన్నట్లు చుట్టూ ఓ వందమంది సెక్యురిటీ సిబ్బంది, వెనక మరో వందో యాబయ్యో వాహనాలు ఫాలో అవుతుంటే పాపం రైతుల కోసమని ఎండల్లో పాదయాత్రలు చేస్తున్నారు. ఉత్తరభారతంలో పాదయాత్రల పర్వం ముగించుకొన్న తరువాత తెలంగాణా రాష్ట్రంలో అదిలాబాద్ జిల్లా నిర్మల్ లో ఈ నెల 11న పాదయాత్రలు చేసి ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలను పరామర్శిస్తారుట.

 

రాహుల్ గాంధీ ఈవిధంగా పాదయాత్రలు, పరామర్శ యాత్రలు, ఓదార్పు యాత్రలు చేయడం చూస్తుంటే ఎవరికయినా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే మొదట గుర్తుకు రావడం సహజం. అయితే గత పదేళ్ళుగా ప్రధాన మంత్రి కుర్చీని రిజర్వు చేసి ఉంచినప్పటికీ అందులో కూర్చోవడానికి భయపడిన రాహుల్ గాంధీ, ఇప్పుడు కనీసం పార్టీ అధ్యక్ష పదవినయినా చెపట్టాలని ఆత్రుత పడుతుంటే, ఆయన దానికీ అర్హుడు కాడని పార్టీ వర్గాలే చెవులు కోరుకోవడం చూసి పార్టీ మీద అలిగి రెండు నెలల పాటు విదేశాలకు వెళ్లిపోయారు. మళ్ళీ తిరిగి వచ్చి పాదయాత్రలు మొదలుపెట్టారు.

 

జగన్మోహన్ రెడ్డికి కూడా ముఖ్యమంత్రి కుర్చీలో ఒక్కసారయినా కూర్చొని రాష్ట్రాన్ని పాలించాలని తపిస్తున్నారు. అయితే ఆయనకి రాహుల్ గాంధీలాగ వడ్డించిన విస్తరి దొరకలేదు. దొరికి ఉండి ఉంటే ఏవిధంగా ఉండేదో తెలియదు కానీ ఆయన తన లక్ష్యసాధన కోసం గత ఐదారేళ్ళుగా చాలా గట్టిగానే కృషి చేస్తున్నారు. ఆయనే స్వయంగా ఒక పార్టీని స్థాపించుకొని, తన నాయకత్వంలోనే ఎన్నికలను ఎదుర్కొని చాలా మంచి ఫలితాలనే రాబట్టగలిగారు. ఆవిధంగా చూసినట్లయితే రాహుల్ గాంధీ కంటే జగన్మోహన్ రెడ్డికే మంచి నాయకత్వ లక్షణాలున్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడయిన జగన్మోహన్ రెడ్డితోనే రాహుల్ గాంధీ సరితూగలేనప్పుడు ఇక అన్ని విధాల సమర్ధుడు, మంచి పరిపాలనాదక్షుడు, రాజకీయ అనుభవజ్ఞుడు అయిన ప్రధాని నరేంద్ర మోడీతో ఏవిధంగా సరితూగ గలడు?

 

యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నరేంద్ర మోడీని డ్డీ కొనలేక చతికిల పడిన రాహుల్ గాంధీ, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీని, సమర్దుడయిన ప్రధానిగా నిరూపించుకొని మరింత శక్తివంతుడిగా ఎదిగిన నరేంద్ర మోడీని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కేంద్రంలో అధికారం సాధించిపెట్టగలరని అనుకోవడం అత్యాశే అవుతుంది. ఈ సంగతి తెలిసినప్పటికీ, కాంగ్రెస్ నేతలు చాలా మంది రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాల గురించి సందేహాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆయనే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చెప్పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగినట్లయితే దాని వలన కాంగ్రెస్ పార్టీకే తీరని నష్టం కలగవచ్చును.

 

నిజానికి రాహుల్ గాంధీ నెహ్రు కుటుంబానికి వారసుడనే ఏకైక అర్హత తప్ప గత పదేళ్ళలో తన నాయకత్వ లక్షణాలు ప్రదర్శించుకొని తనకంటూ పార్టీలో ఒక ప్రత్యక గుర్తింపు సాధించలేకపోయారనే చెప్పవచ్చును. ఇప్పుడు పార్టీలో చాలా మంది తన నాయకత్వ లక్షణాలను ప్రశ్నిస్తున్నారు కనుక లోక్ సభలో నరేంద్ర మోడీ గురించి ఏవో నాలుగు విమర్శలు గుప్పించేసి, ఏదో నాలుగు ఊళ్లు తిరిగేసినంత మాత్రాన్న ఆయన పార్టీ పగ్గాలు చేప్పట్టేందుకు అర్హుడయిపోలేరు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకొనేందుకు రాహుల్ గాంధీ కృషి చేస్తునట్లయితే పరువాలేదు. కానీ రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్ కాపాడటం కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేయడం మొదలుపెడితే దాని వలన చివరికి నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ...దానినే నమ్ముకొన్న వేలాది నేతలు...లక్షలాది కార్యకర్తలే.