కేసీఆర్ అసలు టార్గెట్ అదేనా? ఈడీ చార్జీషీట్ అందుకేనా?
posted on May 29, 2021 1:22PM
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసీఆర్ మంత్రివర్గం నుంచి సీనియర్ నేత ఈటల రాజేందర్ బర్తరఫ్ సంచలనం కాగా... ఈటల భవిష్యత్ కార్యాచరణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. రాజేందర్ కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరిగినా.. తాజాగా ఆయన బీజేపీలో చేరబోతున్నారని చెబుతున్నారు. ఈటల కదలికలను గమనిస్తున్న గులాబీ బాస్.. ఎప్పటికప్పుడు ప్రతివ్యూహాలు అమలు చేస్తున్నారు. అయితే ఈటల గురించి టీఆర్ఎస్ పార్టీలో పెద్దగా ఆందోళన ఉన్నట్లు కనిపించడం లేదు. ఇదిలా ఉండగానే తెలుగు రాష్ట్రాల్లో కాక రేపిన ఓటుకు నోటు కేసులో ఈడీ చార్జీషీట్ దాఖలు చేయడం రచ్చ రాజేసింది. సడెన్ గా ఈ కేసును ఎందుకు తెరపైకి తెచ్చారన్నది చర్చగా మారింది.
2015లోవెలుగులోనికి వచ్చిన ఓటుకు నోటు కేసులో ఈడీ గురువారం చార్జీషీట్ దాఖలు చేసింది. ఇందులో రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా ఈడీ పేర్కొంది. ఛార్జీ్‌షీట్‌లో రేవంత్‌తో పాటు వేంకృష్ణ కీర్తన్‌రెడ్డి, సెబాస్టియన్‌ల పాత్ర కూడా ఈడీ పేర్కొంది. ఓటుకు నోటు కేసులో ఈడీ చార్జీ షీట్ దాఖలు చేయడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి దూకుడుకు బ్రేక్ వేయాలనే కారణంతోనే కేసును మళ్లీ తెరపైకి తెచ్చారని అంటున్నారు. ఈటల కంటే రేవంత్ రెడ్డిపైనే గులాబీ బాస్ ఎక్కువ ఫోకస్ చేశారని తెలుస్తోంది. జూన్ లో తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడని నియమిస్తారని తెలుస్తోంది. టీపీసీసీ రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య పోటీ ఉంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతుందని సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారంతో అలర్టైన గులాబీ బాస్.. రేవంత్ కు ఆ పదవి దక్కకుండా ఉండేందుకు ఎత్తులు వేస్తున్నారని, అందులో భాగంగానే ఓటుకు నోటు కేసులో చార్జీ షీట్ దాఖలైందనే ప్రచారం జరుగుతోంది.
కొంత కాలంగా టీఆర్ఎస్ సర్కార్ కు, కేసీఆర్ కు పక్కెలో బల్లెంలా తయారయ్యారు ఎంపీ రేవంత్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు వెలుగులోనికి తెస్తూ జనం ముందు ఉంచుతున్నారు. కొవిడ్ కట్టడిలో సర్కార్ తీరును ఎండగడుతున్నారు. పాలనలో జరుగుతున్న అక్రమాలు, స్కాములు భయటపెడుతున్నారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భూకబ్జా బాగోతాలను ఆధారాలతో సహా వెలికి తీస్తున్నారు. రేవంత్ రెడ్డి పోరాటానికి తెలంగాణ జనాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆయన క్రేజీ రోజురోజుకు పెరిగిపోతోంది. కేసీఆర్ ను వ్యతిరేకించే వారంతా రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి వస్తే.. తమకు ఇబ్బందులు తప్పవని కేసీఆర్ భయపడిపోతున్నారట. అందుకే అతనికి ఆ పదవి రాకుండా ఓటుకు నోటు కేసుతో అడ్డుకోవాలని చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో రేవంత్ రెడ్డిపై అభియోగాలు రుజువయితే.. పీసీసీ విషయంలోన కాంగ్రెస్ హైకమాండ్ పునరాలోచన చేసే అవకాశం ఉంది. అందుకే టైమ్ చూసి ఈ కేసును గులాబీ బాస్ తెర పైకి తెచ్చారంటున్నారు.
సీఎం కేసీఆర్ పై ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. గతంలో ఎప్పుడు లేనంతగా జనాల నుంచి ఆయన చీత్కారాలు ఎదుర్కొంటున్నారు. ప్రగతి భవన్ లేదా ఫాంహౌజ్ తప్ప జనంలోకి రావడం లేదనే విమర్శలు కేసీఆర్ పై ఉన్నాయి. కొవిడ్ కష్టాల్లోనూ జనాలను గాలికొదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో ఎంపీ రేవంత్ రెడ్డి మాత్రం జనంలో ఉన్నారు. బొల్లారంలో 50 పడకల హాస్పిటల్ ను ఏర్పాటు చేశారు. గాంధీ హాస్పిటల్ లో దగ్గర రోజూ వెయ్యి మందికి భోజనం అందిస్తున్నారు. అంతేకాదు ఆక్సిజన్ కొరత, ఇంజక్షన్ల కొరతపై ఎప్పటికప్పుడు అధికారులను నిలదీస్తూ... రోగులకు సరైన చికిత్స అందించటానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి పాపులారిటీ పెరిగింది. ఈ సమయంలో పీసీసీ బాధ్యతలు వస్తే రేవంత్ రెడ్డి... మరింత పవర్ ఫుల్ లీడర్ అవుతారని, వచ్చే ఎన్నికల్లో అతన్ని ఎదుర్కోవడం కష్టమని కేసీఆర్ భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకే పీసీసీ పగ్గాలు రాకుండా కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి అనుచరులు మండిపోతున్నారు.
మరోవైపు ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డికి ఊరట దక్కడం గులాబీ పార్టీని నిరాశకు గురి చేసిందని చెబుతున్నారు. ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు ఓటుకు నోటు కేసులోని సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. సాక్షులందరి చీఫ్ ఎగ్జామినేషన్ పూర్తయ్యేవరకు క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టవద్దంటూ ఈ కేసులో ప్రధాన నిందితుడు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. పిటిషన్‌లో ప్రతివాదిగా ఉన్న ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానమివ్వాలని ఆదేశించింది.