కేసీఆర్ కు కరోనా ఎలా వచ్చిందో తెలుసా..!

కరోనా సెకండ్ వేవ్ దేశంలో విలయ తాండవం చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ విజృంభించింది. తెలంగాణలో మొదటి వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో వైరస్ బీభత్సం స్పష్టించింది. లక్షలాది మందికి సోకింది. హాస్పిటల్ లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సామాన్యులు, పేదలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరిని చుట్టేసింది మహమ్మారి. ఎక్కువగా బయటికి రాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా కరోనా సోకింది. 

కేసీఆర్ కు కరోనా పాజిటివ్ రావడంతో  చాలామంది ఆశ్చర్యపోయారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ఆయనకు ఎలా వచ్చిందని అనుకున్నారు. అయితే ఆదివారం సిద్ధిపేటలో  పర్యటించిన కేసీఆర్.. అక్కడ జరిగిన సమావేశంలో సుదీర్ఘంగా  ప్రసంగించారు. రాష్ట్ర పథకాలు, అభివృద్ధి గురించి వివరిస్తూనే కరోనాపైనా మాట్లాడారు. ఈ సందర్భంగా  తనకు కరోనా ఎలా సోకిందో కామెడీగా వివరించారు కేసీఆర్. 

"ఇటీవల ఓ పెళ్లికి వెళ్లాను, అక్కడ పెళ్లి కొడుకు మాస్కు తీసేయాలని కోరాడు. మాస్కు తీయడం ఎందుకని అడిగితే, మీరు మళ్లీ మాకు దొరకరు కదా సార్, అందుకే ఫొటో తీసుకుందామని మాస్కు తీయమన్నాం సార్ అని ఆ పెళ్లికొడుకు చెప్పాడు. నేను నీకు దొరకడం ఏమో కానీ, మాస్కు తీసేస్తే కరోనాకు నేను దొరుకుతా అని చెప్పా. ఆ విధంగా నా మాస్కును వాడు లాగి, వీడు లాగి చివరికి నాక్కూడా కరోనా వచ్చింది" అని అందరిలోనూ నవ్వులు పూయించారు.