మంత్రి హరీశ్ రావు కారుకు ప్రమాదం.. తప్పిన ముప్పు 

తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు‌ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హరీష్ రావు వాహనం భారీగా ధ్వంసం అయింది.  డ్రైవర్, గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. మంత్రి  హరీశ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం సిద్దిపేటలో జరిగిన సీఎం కేసీఆర్ పర్యటనలో పాల్గొన్న హరీష్ రావు.. సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దుద్దెడ సమీపంలో హరీష్ రావు కారు అడవి పంది అడ్డుగా వచ్చింది. దీంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో హరీశ్ కారు కాన్వాయ్‌లోని మరో వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో డ్రైవర్, గన్‌మెన్‌కు గాయాలు కాగా...  వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మంత్రి హరీశ్ రావు క్షేమంగా బయటపడగా.. మరో కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు.హరీశ్‌కు ప్రమాదం తప్పడంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.