టీడీపీకి రాజీనామా చేస్తూ అశోక్ గజపతి రాజు భావోద్వేగం

 

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు తెలుగు దేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేశారు. అలాగే పార్టీ పొలిట్ బ్యూరో పదవికి కూడా రిజైన్ చేశారు.  ఇటీవల రాష్ట్ర పతి ఆయన్ను గోవా గవర్నర్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే గోవా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. తక్షణమే తన రాజీనామాను ఆమోదించవలసిందిగా ఆయ‌న‌ టీడీపీ అధిష్ఠానాన్ని కోరారు. ఈ మేరకు రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులకు పంపించారు. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటి వరకు టీడీపీలో పనిచేసేందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీలో ఎన్నో అవకాశాలు అందుకున్నట్లు చెప్పుకొచ్చారు. 

ఇన్ని అవకాశాలు కల్పించిన పార్టీకి, సీఎం చంద్రబాబుకు అశోక్ గజపతిరాజు ప్ర‌త్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.1978లో జనతా పార్టీ అభ్యర్థిగా ఏపీ శాసనసభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి అశోక్‌ గజపతి రాజు పార్టీలో కొనసాగుతున్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన అశోక్‌ గజపతిరాజు రెండవసారి శాసన సభకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో కూడా విజయనగరం నుంచి విజయం సాధించారు. అయితే, 2004లో అశోక్‌ గజపతిరాజు ఓటమి పాలయ్యారు. కానీ, 2009లో తిరిగి అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా కూడా పనిచేశారు.