ఉత్తమ విద్యార్థులు కావాలంటే...!

అందరూ జీవితం గురించి, సమస్యల గురించి, పరిష్కారాల గురించి, ఇంకా రేపటి గురించి, ఎన్నో రకాల భవిష్యత్ కార్యాచరణల గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ విద్యార్థుల గురించి చెప్పేవారు, మాట్లాడేవారు చాలా తక్కువ. విద్యార్థులకు చక్కని మార్గాలు, మెళకువలు అందించేవారు తక్కువ. అయితే విద్యార్థుల కోసం కొన్ని ఆచరించదగ్గ చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో, కలిగే ఫలితాలలో మార్పులను స్పష్టంగా గమనించగలుగుతారు.  అప్పుడు వారు ఉత్తమ విద్యార్థులూ అవుతారు. అయితే ఉత్తమ విద్యార్థులు కావడం కోసం కొన్ని చిట్కాలు...

రాయడానికి కానీ, చదవడానికి కానీ కూర్చున్నవారు తమ శరీరాన్ని అనవసరంగా కదిలించకూడదు. చాలామంది విద్యార్థులు చదువుకోవడానికి అపసవ్యమైన భంగిమల్లో కూర్చుంటూ ఉంటారు. ఇక కొందరుంటారు. ఏదో దీర్ఘమైన ఆలోచనలో మునిగిపోయినవాళ్ళలా ఏదో ఒకదాన్ని రెప్పవాల్చకుండా చూస్తూ కూర్చుంటారు. మరికొందరు చదువుకొనేటప్పుడు పెన్నులు, పెన్సిళ్ళు నోటిలో పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి  అలవాట్లు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏకాగ్రతను భంగం కలిగించేవే! కదులుతున్న పాత్ర తనలోని నీటిని సైతం కదిలించినట్లే, శరీరం తన భంగిమను మార్చినప్పుడల్లా మనస్సు చలిస్తూ ఉంటుంది. కాబట్టి, చదువుకొనేటప్పుడు హుందాతో కూడిన స్థిరమైన భంగిమలో కూర్చోవడం ముఖ్యం.

నిర్ణీత సమయంలో ఏదో ఒకే అంశాన్ని తీసుకొని, దానినే అధ్యయనం చేయాలనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. అయితే, ఒక అంశాన్ని ఎంచుకొన్నప్పుడు ఇక కనీసం ఓ గంట పాటు పూర్తిగా ఆ అంశంలోనే మనస్సును లీనం చేయాలి. కేవలం పుస్తకాన్ని చదువుకొంటూ వెళ్ళినంత మాత్రాన ఆ పుస్తకాన్ని అధ్యయనం చేసినట్లు కాదు. పుస్తకాన్ని పట్టి చదవడానికీ, పూర్తిగా అధ్యయనం చేయడానికీ మధ్య ఉన్న తేడాను మొదట తెలుసుకోవాలి. కానీ, ఒక్క విషయం. పుస్తకాన్ని చదవడానికైనా, అధ్యయనం చేయడానికైనా  రెండిటికీ ఏకాగ్రత కావాల్సిందే! పేజీలు తిరగేస్తూ పుస్తకాన్ని పైపైన చదవడం వల్ల దానిలోని సారాంశమేమిటో పాఠకుడికి తెలియవచ్చు. కానీ, పుస్తకాన్ని క్షుణ్ణంగా చదవడం వల్ల మనస్సు దానిలోని అంశాల లోతుల్లోకి వెళుతుంది. వాటి అంతరార్థాన్ని తెలుసుకొంటుంది. తరచుగా అందులో దాగున్న సారాన్నీ గ్రహిస్తుంది. దీనివల్ల సంబంధిత అంశం మీద గట్టి పట్టు వస్తుంది. మరింత చదవడానికి తోడ్పడుతుంది.

చదువుకోవడానికి ఓ అంశాన్ని ఎంచుకొని. చదువుకొనే బల్ల దగ్గరకు వచ్చాక పైన చెప్పినట్లుగా పూర్తిగా ఓ గంట సేపు దాని మీదనే ఏకాగ్రత  కొనసాగించాలి. అది చాలా ముఖ్యం. సాధారణంగా, ఓ కొత్త అంశాన్ని వెంటనే గ్రహించి, అర్థం చేసుకోవడానికి మనస్సు సిద్ధంగా ఉండదు. రోజు పొడుగూతా మనం చేసిన రకరకాల పనులు కానీ, మిత్రులతోనూ, ఇతరులతోనూ జరిపిన సంభాషణలు కానీ, చదువుకోవడానికి కూర్చొనేందుకు సరిగ్గా ముందే మన మనస్సుల్లో నిండిన ఆలోచనలు కానీ మనలో ఇంకా అలాగే ఉంటాయి. అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. కాబట్టి, ప్రస్తుతం చదువుకోవాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టు మనస్సు సిద్ధం కావడానికి కనీసం ఎనిమిది నుంచి పది నిమిషాల దాకా సమయం పట్టవచ్చు. మనస్సును సిద్ధం చేసి, చదువుకోవడం  ప్రారంభించాక అది క్రమంగా చదువుతున్న అంశం లోతుల్లోకి వెళుతుంటుంది. సరిగ్గా అప్పుడు ఉన్నట్టుండి చదవడం ఆపేస్తే, ఏకాగ్రత పోతుంది. చదువు దెబ్బతింటుంది. 

కాబట్టి, చదవడం మొదలుపెట్టిన కొద్ది నిమిషాల తరువాత మనస్సు ఏకాగ్రత అయ్యాక, మరింత లోతుగా వెళ్ళి, గాఢంగా చదవడానికి  ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆ రకంగా నిరంతరాయంగా కనీసం ఓ గంట పాటు అధ్యయనం సాగించడానికి మనస్సును వినియోగించాలి.

 ఇలా మనం చదువుకొనే సమయంలో కుటుంబ సభ్యులెవరైనా పిలిచి, ఏదైనా పని చెప్పవచ్చు. కాబట్టి, "ఓ గంట సేపు నన్నెవరూ దయచేసి పిలవకండి" అని ఇంట్లోని వాళ్ళందరికీ ముందుగానే చెప్పేయాలి. ఎందుకంటే, ఎవరూ పిలవకపోయినా,  ఎవరైనా మధ్యలో పిలిచి, అంతరాయం కలిగిస్తారేమోనన్న ఆలోచన మనస్సు లోలోపల ఉన్నా చాలు, చదువు మీద మనస్సును పూర్తిగా లగ్నం చేయలేం. వస్తారేమో… పిలుస్తారేమో అనే ఆలోచన వల్ల మనసు కుదురుగా చదువు మీద నిలువదు. అందుకే చదువుకునే సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ముందే ఎవరూ పిలవకండి అని చెప్పాలి.

ఇలా చదువుకునే పిల్లలు పై చిట్కాలు ఫాలో అయితే ఉత్తమ విద్యార్థులు అవుతారు.

                               ◆నిశ్శబ్ద.