తెలుగుదేశం కు ఓ గవర్నర్ పదవి.. కేంద్రం ఆఫర్ నిజమేనా?
posted on Nov 30, 2024 8:56AM
.webp)
తెలుగుదేశం, బీజేపీల మధ్య 2014-2019 మధ్య కాలంలో సంబంధాలు బెడిసికొట్టడానికి విభజన హామీల అమలు, రాష్ట్రానికి కేటాయింపులు, ప్రత్యేక హోదా, రైల్వేజోన్ లతో పాటు మరో అంశం కూడా కారణం అయ్యింది. అదే గవర్నర్ పదవి. అప్పట్లో కేంద్రంలోని మోడీ సర్కార్ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి ఓ గవర్నర్ పదవి ఇస్తానన్న హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అప్పట్లో మోత్కుపల్లి నర్సింహులును ఏదో ఓ రాష్ట్రానికి గవర్నర్ గా పంపిస్తానన్న వాగ్దానం చేశారు. అయితే ఆ ఐదేళ్ల కాలంలో అది జరగలేదు. ఈ లోగానే విభజన హామీల అమలు, వాగ్దానాలను నెరవేర్చడంలో అప్పటి మోడీ సర్కార్ మొండి వైఖరి కారణంగా తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసింది. దీంతో అప్పటి గవర్నర్ పదవి హామీ నెరవేరలేదు. గవర్నర్ గిరీ రాలేదన్న అలకతో మోత్కుపల్లి అప్పట్లో తెలుగుదేశం పార్టీని వీడి వెళ్లిపోయారు. అది వేరే సంగతి.
ఇక ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత కేంద్రంలో మోడీ సర్కార్ తెలుగుదేశం మద్దతుపై మనుగడ సాగించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో తనంత తానుగానే తెలుగుదేశం కు ఓ గవర్నర్ పదవి ఇచ్చేందుకు ఆఫర్ చేసిందని అంటున్నారు. ఇలా మిత్రపక్షాలకు గవర్నర్ పదవి ఇవ్వడమన్నది కొత్తేమీ కాదు. ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరికి అప్పటి కేంద్రం గవర్నర్ పదవులను కట్టబెట్టిన సంగతి విదితమే. ఇప్పుడు కేంద్రం గవర్నర్ పదవి ఆఫర్ అన్నది వాస్తవమే అయితే ఆ పదవి కోసం కూడా తెలుగుదేశంలో పోటీ తీవ్రంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
సీనియర్ నాయకులు అశోకగజపతిరాజు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరంతా కూడా తొలి నుంచీ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. ముఖ్యంగా యనమల, అశోకగజపతిరాజులు చంద్రబాబుకు సన్నిహితులుగా గుర్తింపు పొందారు. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే పార్టీ కష్టకాలంగా గట్టిగా నిలబడ్డారు. నిజంగా తెలుగుదేశం నుంచి ఒకరిని గవర్నర్ గా పంపించాలని కేంద్రం భావిస్తే చంద్రబాబు వీరిలో ఎవరికి అవకాశం ఇస్తారన్న చర్చ ఇప్పుడు పార్టీలో జోరుగా సాగుతోంది.