ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే ముగ్గురూ ఎవరు?.. పీటముడి పడిందా?
posted on Nov 30, 2024 8:33AM

రాజ్యసభ ఉప ఎన్నికలలో ఏపీ నుంచి మూడు స్థానాలు ఉన్నాయి. మెజారిటీ సభ్యులను బట్టి చేస్తే ఆ మూడు స్థానాలూ కూటమి అభ్యర్థులే గెలుచుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలా మూడు స్థానాలూ ఖాళీ ఎందుకు అయ్యాయంటే వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఎంపీలలో ముగ్గురు ఆర్. కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి మూడు స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో కూటమి పార్టాలలో ఎవరెవరికి స్థానం దక్కుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
అయితే సహజంగానే తెలుగుదేశం ఈ స్థానాలలో పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ మిత్రధర్మంలో భాగంగా ఒక స్థానాన్ని బీజేపీ, జనసేనలలో ఏదో ఒక పార్టీకి వదిలివేయడానికి సుముఖంగా ఉంది. ఇక తెలుగుదేశం నుంచి పోటీ చేసే ఇద్దరూ ఎవరన్న విషయానికి వస్తే.. ముందస్తుగానే తెలుగుదేశం ఇచ్చిన హామీ మేరకు ఒక స్థానం తాజా మాజీ బీద మస్తాన్ రావుకు ఖరారైంది. అలాగే బీద మస్తాన్ రావుతో పాటే వైసీపీకీ, రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరిన మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యత్వంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలన్న దానిపై తెలుగుదేశం అధినేత కసరత్తు చేస్తున్నారు.
ఇక ఆర్ కృష్ణయ్య రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగినా, స్వయంగా నాగబాబే అదంతా ప్రచారం మాత్రమేనని ఎక్స్ వేదిక ద్వారా స్పష్టం చేశారు. తనే సోదరుడు హస్తిన పర్యటన తనకు రాజ్యసభ స్థానం కోసమే అంటూ జరుగుతున్న ప్రచారానికి చుక్క పెట్టేస్తూ, పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే నిలబడతారు కానీ స్వార్థం కోసం కాదని క్లారిటీ ఇస్తూ, ఆయన హస్తిన పర్యటనతో తనకు రాజ్యసభ స్థానం కోసం ఎలాంటి ప్రయత్నాలూ లేవని కుండబద్దలు కొట్టేశారు.
దీంతో ఇప్పుడు ఆ మూడో స్థానం ఎవరిది అన్న విషయంపై రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాజ్యసభలో బలం పెంచుకునే క్రమంలో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీ కోరుతోందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి ఇంకా ఏ గూటికీ చేరని ఆర్. కృష్ణయ్యకు కాషాయి కండువా కప్పి రాజ్యసభకు పంచించే యోచనలో బీజేపీ ఉందని విశ్వసనీయంగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఇటీవలి హస్తిన పర్యటనలో మోడీతో జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కూడా కుదిరిందంటున్నారు. ఇక ఇటు తెలుగుదేశం పార్టీ కూడా.. మూడో స్థానం జనసేన, బీజేపీలలో ఎవరికైనా ఒక్కటే అన్న భావంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్.కృష్ణయ్య కమలం గూటికి చేరి రాజ్యసభకు వెళ్లే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.
బీసీ వర్గాల్లో మంచిఇమేజ్ ఉన్న కృష్ణయ్యను బీజేపీలో చేర్చుకుని రాజ్యసభకు పంపడం ద్వారా రాజకీయంగా తమకు లబ్ధి ఉంటుందని కమలనాథులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక బీద మస్తాన్ రావు కాకుండా మరో స్థానానికి అభ్యర్థి ఎవరన్న విషయంలో తెలుగుదేశంలో తీవ్ర పోటీ నెలకొని ఉందని అంటున్నారు. మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఆయన అభిప్రాయాన్ని కూడా పరిగణనలోనికి తీసుకుని ఆయన సూచించిన వ్యక్తికి రాజ్యసభ టికెట్ ఇచ్చే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో వైసీపీ హయాంలో పార్టీ కోసం నిలబడి కష్టనష్టాలకు గురైన వారిని రాజ్యసభకు పంపాలన్న డిమాండ్ తెలుగుదేశంలో గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజ్యసభకు తెలుగుదేశం తరఫున టికెట్ దక్కేదెవరికి అన్న విషయంలో పీటముడి పడిందని రాజకీయవర్గాలలో వినిపిస్తోంది.